ఇసుక తుపాను వచ్చిందంటే చాలు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. అమెరికాలోని ఉటా నగరంలో సంభవించిన ఇసుక తుపాను బీభత్సం 8 మందిని బలిగొంది. ఉటా నగరంలోని ఇంటర్ స్టేట్ హైవేపై ఇసుక తుపాను కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సుమారు 22 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు.
సుమారు 22 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో వాహనాలలో ప్రయాణిస్తున్న వారిలో 8 మంది చనిపోగా, మరో 10 మంది వరకు గాయపడ్డారని స్థానిక మీడియా రిపోర్టు చేసింది. ఒక్కసారిగా ఇసుక తుపాను రావడంతో రహదారి సరిగా కనిపించక ఎగ్జిట్ పాయింట్ల వద్ద వరుసగా వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. తుపాను కొంత సమయం వరకు అలాగే కొనసాగడంతో వాహనదారులు తమ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదని తెలిపారు.
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో చనిపోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు, గాయపడ్డ వారికి ప్రాథమిక చికిత్సందించిన తరువాత ఇళ్లకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓ వాహనంలో ప్రయాణిస్తున్న ఐదు మంది కుటుంబ సభ్యులు దుర్మరణం చెందడంతో ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భారీ ట్రక్కులు, కార్లు, ఇతర వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో కొన్ని వాహనాలు నుజ్జునజ్జయ్యాయి. రోడ్డు ప్రమాదం సంభవించిన ప్రదేశం భయానకంగా మారినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది. ఇసుక తుపాను కారణంగా సంభవించిన ఈ బీభత్సం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎయిర్ అంబులెన్సుల ద్వారా సకాలంలో స్పందించి ప్రాథమిక చికిత్స అందించడంతో కొందరు చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇసుక తుపానులు సంభవించే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.
సరదాగా వీకెండ్ గడిపిన తరువాత కొందరు ఉటా హిస్టరీ హాలిడే ముగించుకుని వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు. ఈ ప్రాంతంలో ఇది అత్యంత ఘోర రోడ్డు ప్రమాదమని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. మరణించిన వారి వివరాలను అధికారులు సేకరించి వారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. మంచు తుపానులతో సతమతమయ్యే అమెరికా వాసులు ఇసుక తుపానులతో సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
కాగా, చైనాలోనూ ఇసుక తుపాను ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఓవైపు వరదలతో లక్షలమంది నిరాశ్రయులయ్యారు. చైనాలోని డుంహుయాంగ్ నగరం గోబీ ఎడారిని అనుకోని ఉండగా, ఆదివారం ఇసుక తుఫాను స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సుమారు 300 అడుగుల మేర ఇసుక రేణువులు గాల్లోకి లేవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.