Egyptair Crash 2016: ఓ సిగరెట్ ఖరీదు ఎంత? ఎంతుంటే ఏంటి అంటారా? కానీ ఓ సిగరెట్ ఖరీదు 66 మంది ప్రాణాలు. అవును.. సరిగ్గా ఆరేళ్ల కిందట జరిగిన ఓ విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆ నిజాలు ఏంటో మీరే చూడండి.
ఆ ప్రమాదంపై
2016 మే 19న ఈజిప్ట్‌కు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తోన్న 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముందు దీన్ని ఓ ఉగ్రవాద దాడిగా అనుమానించారు. ఆ తర్వాత సాంకేతిక సమస్య వల్లే ప్రమాదం జరిగిందని అనుకున్నారు.
కానీ ప్రమాదానికి గురైన ఆ విమానం 2003 నుంచే సర్వీసుల్లోకి అడుగుపెట్టింది. అంటే కేవలం 13 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంది. సాధారణంగా ఆ విమానం లైఫ్ 30 నుంచి 40 ఏళ్లు ఉంటుంది. దీంతో ప్రమాదంపై విస్తృతస్థాయి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో షాకింగ్ విషయం తెలిసింది. ప్రమాదానికి ఒక సిగరెట్ కారణమని విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన ఫ్రెంచ్ ఏవియేషన్ నిపుణులు తేల్చారు.
సిగరెట్
పైలట్ సిగరెట్ అంటించడం వల్ల కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయని, ఫలితంగా విమానం కుప్పకూలిందని వారు నిర్ధారించారు. దర్యాప్తునకు సంబంధించి 134 పేజీల నివేదికను పారిస్‌లోని అప్పీల్ కోర్టులో నిపుణులు సమర్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలతో 'న్యూయార్క్ పోస్ట్' తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది.
కాక్‌పిట్‌లో పైలట్ సిగరెట్ వెలిగించగానే అత్యవసర మాస్క్ నుంచి ఆక్సిజన్ లీకై కాక్‌పిట్‌లో మంటలు చెలరేగాయి. ఫలితంగా విమానం కుప్పకూలిందని దర్యాప్తు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాక్‌పిట్‌లో మంటలు అంటుకున్న సమయంలో సిబ్బంది భయంతో అరుస్తున్న శబ్దాలు మాస్క్‌కు ఉన్న మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి. ఇక పైలెట్ సిగరెట్ పొగ పీల్చినట్లు రికార్డయిన శబ్దాల గురించి ఇటాలియన్ పత్రిక కార్రియర్ డెల్లా సెరా కూడా ఓ కథనం ప్రచురించింది.
ఘోర ప్రమాదం
2016 మే 19న ఎయిర్‌బస్-ఎ320 పారిస్ నుంచి ఈజిప్ట్ రాజధాని కైరోకు బయలుదేరింది. గ్రీక్ ద్వీపాలకు 130 నాటికల్ మైళ్ల దూరలో రాడార్ నుంచి విమానం అదృశ్యమైంది. ఆ తర్వాత కాసేపటికే క్రెటె ద్వీపం సమీపంలో తూర్పు మధ్యధరా సముద్రంలో కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ఈజిఫ్ట్ పౌరులు, 15 మంది ఫ్రెంచ్ పౌరులు సిబ్బంది సహా మొత్తం 66 మంది ఉండగా, అందరూ ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Viral News: బాల్కనీలో బట్టలు ఆరేశారా? వెంటనే తీసేయండి, లేకపోతే రూ. 20 వేలు ఫైన్!
Also Read: Elon Musk About Coca-Cola: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన- ఆ కంపెనీ కొనేస్తారట!