Daylight Saving Time: ఛ.. ఇంకాసేపు వెలుతురు ఉండుంటే బాగుండు అని సాయంకాల సమయాల్లో మనలో చాలా మంది, చాలా సార్లు అనుకునే ఉంటాం. అందుకు కారణాలు అనేకం. ఆడుకోవడానికి పిల్లలు, చీకటి పడకుండానే ఇంటికి చేరుకోవాలి అనుకునేవారు, ప్రకృతి వెలుతురులో సినిమా షూటింగ్ కొనసాగించాలి అని ఆశపడేవారు.. ఇలా ఎవరి కారణాలు వాళ్లకుంటాయి. కానీ ఓ విచిత్రమైన టెక్నిక్ ఫాలో అవుతున్న అమెరికన్లు పగటి వెలుతురు సమయాన్ని ఓ గంట పెంచుకుంటున్నారు. దీని పేరు డేలైట్ సేవింగ్ టైమ్. షార్ట్ కట్ లో డీఎస్టీ. ఈ డీఎస్టీ ప్రతి ఏడాది మార్చి రెండో ఆదివారం మొదలై... నవంబర్ రెండో ఆదివారం ముగుస్తుంది. అసలు ఏంటీ డే లైట్ సేవింగ్ టైం?  వివరంగా చెప్పుకుందాం.


అక్కడ డేలైట్ ఎక్కువ


ఈ డీఎస్టీలో ఏం చేస్తారంటే... వేసవి కాలం ప్రారంభమైనప్పుడు అమెరికా మొత్తం గడియారాలను ఓ గంట ముందుకు తిప్పుతారన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా మార్చి రెండో ఆదివారం అని. అలాగే... ఈ ఏడాది మార్చి 13న ఈ డేలైట్ సేవింగ్ టైం స్టార్ట్ అయింది. మార్చి 13 తెల్లవారుజాము 2 గంటలకు ఇది ప్రారంభం అవుతుంది. ఇలా వేసవికాలంలో గంట ముందుకు వెళ్లడం వల్ల డే లైట్ ఎక్కువ సేపు ఉండే ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఉదాహరణకు ఆరున్నర, ఏడు గంటలకు అయ్యే సూర్యాస్తమయం మన గడియారాలకు అనుగుణంగా ఏడున్నర, 8 గంటలకు అయిన ఫీలింగ్ లో మనం ఉంటాం. ఈ డీఎస్టీను ఫాలో అవడం మార్చిలో మొదలై నవంబర్ దాకా ఉంటుంది. నవంబర్ లో ఆటమ్ సీజన్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే శరద్రుతువు అమెరికాలో ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్లీ గడియారాలను ఓ గంట వెనక్కి తిప్పుకుంటారన్నమాట. కరెక్టు సమయాన్ని చేరుకునేలా. 


మార్చి నుంచి నవంబర్ దాకా డీఎస్టీ ఫాలో అవడం వల్ల ప్రత్యేకంగా మనకు అదనపు సమయం ఏమీ రాదు. కానీ డే లైట్ ను ఎక్కువ వినియోగించుకుంటున్నామన్న సైకలాజికల్ ఫీలింగ్ మాత్రం వస్తుంది. మార్చి, నవంబర్ ఈ రెండు సార్లు కూడా సమయం తెల్లవారుజామున 2 గంటలకే మారుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ముందురోజు అంటే శనివారం రాత్రే పడుకునే ముందు గడియారాలను ఓ గంట ముందుకో లేదా వెనక్కో తిప్పి నిద్రపోతారు.  


115 ఏళ్ల చరిత్ర


ఈ డేలైట్ సేవింగ్ టైంకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గా చెప్పుకునే బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1784లో రాసిన యాన్ ఎకనామికల్ ప్రాజెక్ట్ లో దీని గురించి సెటైరిక్ గా స్పందించారు. ఉదయాన్నే తొందరగా లేచి, రాత్రిళ్లు తొందరగా పడుకోవడం వల్ల డేలైట్ ను ఎక్కువగా ఉపయోగించుకోగలమనే అర్థం వచ్చేలా ఆయన ఇందులో వ్యంగ్యంగా  రాశారు. ఆ తర్వాత 20వ శతాబ్దం ప్రారంభంలో దీన్ని తొలిసారిగా అమలు చేశారు. అప్పుడు ఏప్రిల్ లో 4 ఆదివారాల్లో 20 నిమిషాల చొప్పున ముందుకు... సెప్టెంబర్ లో 4 ఆదివారాల్లో 20 నిమిషాల చొప్పున వెనక్కు గడియారాలను తిప్పేవారు. అయితే మొదట్లో దీన్ని చాలా మంది వెక్కిరించేవారు. ఇదొక అర్థరహితమైన చర్యగా భావించేవారు. 


అయితే తొలి ప్రపంచయుద్ధం తర్వాత అందరి దృక్పథాలు మారిపోయాయి. రాత్రి పూట ఇళ్లల్లో చలికాచుకునే మంటలు వేసుకునేందుకు అవసరమైన బొగ్గును వీలైనంత తక్కువ వాడే ఉద్దేశంతో ఈ డేలైట్ సేవింగ్ టైంను పరిచయం చేశారు. కొన్నాళ్లకే దీని పేరిట చట్టం రూపొందించారు. దానికి ఆమోదం లభించింది. కాలక్రమంలో ఈ చట్టానికి అనేక సవరణలు జరిగాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారం మార్చి నుంచి నవంబర్ వరకు డీఎస్టీని పాటిస్తున్నారు. సుమారు 115 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ డీఎస్టీపై అప్పట్నుంచి ఇప్పటిదాకా వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి. అంతెందుకు... యునైటెడ్ స్టేట్స్ లోనే ఆరిజోనా, హవాయి, ప్యూర్టోరికో వంటి అనేక ప్రాంతాల్లో ఈ డీఎస్టీని అనుసరించరు.