Crime: ఆస్ట్రేలియాలో 2021 లో జరిగిన ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను కాదన్నదన్న కోపంతో ఓ యువతిని తన మాజీ ప్రియుడు అత్యంత క్రూరంగా హతమార్చాడు. 2021 లో ఈ ఘటన జరగ్గా గతేడాదిలోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తాజాగా ఆ యువతి శరీర భాగాలను పోలీసులు కనుగొన్నారు. 


భారత్ కు చెందిన 21 ఏళ్ల జాస్మిన్ కౌర్ ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ లో నర్సింగ్ కోర్సు చదువుతోంది. భారత సంతతికి చెందిన తారిక్ జోత్ సింగ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వివిధ కారణాల వల్ల ఆమె అతడికి దూరంగా ఉండటం మొదలు పెట్టింది. జాస్మిన్ కౌర్ తనను దూరం పెట్టడాన్ని తారిక్ జోత్ తట్టుకోలేకపోయాడు. చాలా సార్లు ఆమె వద్దకు వెళ్లి అభ్యర్థించాడు. అయినా ఆమె ససేమిరా అన్నది. అలా వంద సార్లకు పైగా జాస్మిన్ కౌర్ అతడిని తిరస్కరిస్తూ వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన తారిక్ జోత్ సింగ్ జాస్మిన్ కౌర్ పై పగ పెంచుకున్నాడు. తనను హతమార్చడానికి పక్కాగా పథకం పన్నాడు. 2021 సంవత్సరం మార్చిలో ఒక రోజు ఆమెను కిడ్నాప్ చేశాడు. తనను డిక్కీలో ఉంచి తన కారులో చాలా దూరం ప్రయాణించి ఫిండర్స్ రేంజ్ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అదో అటవీ ప్రాంతం. అక్కడ తారిక్ జోత్ సింగ్ జాస్మిన్ కౌర్ కోసం గోతి తవ్వాడు. అనంతరం కారు డిక్కీలో ఉన్న జాస్మిన్ కాళ్లు, చేతులను వైర్లతో కట్టేశాడు.  అనంతరం సజీవంగానే ఆమెను గొయ్యిలో పడేసి మట్టితో కప్పేశాడు. కొన్ని గంటల పాటు నరకయాతన అనుభవించిన జాస్మిన్ అదే గోతిలో ఊపిరాడక చిత్రవధ అనుభవించి చివరికి ప్రాణాలు వదిలేసింది. 


Also Read: Scholarships 2023: 9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?


జాస్మిన్ కౌర్ కనిపించకుండా పోవడంపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు తారిక్ జోత్ సింగ్ ను గత సంవత్సరం లోనే అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ సందర్భంగా కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో తారిక్ జోతి సింగ్ తను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. జాస్మిన్ కౌర్ ను తను ఎంత కిరాతకంగా చంపింది చెప్పాడు. ఈ నేపథ్యంలో జాస్మిన్ కౌర్ మృతదేహాం అవశేషాలను పోలీసులు అటవీ ప్రాంతంలో గుర్తించి వెలికి తీశారు. మృతదేహం కాళ్లు, చేతులను వైర్లతో కట్టి ఉంచడం, కళ్లకు గంతలు కట్టి ఉండటం చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. టేపులు,  వైర్లను కూడా ఆ గోతిలో గుర్తించారు. తారిక్ జోత్ సింగ్ చేసిన నేరం అసాధారణ స్థాయి క్రూరత్వమని ప్రాసిక్యూటర్ తెలిపారు. 


రిలేషన్ షిప్ బ్రేక్ డౌన్ ను సహించలేకే తారిక్ జోత్ సింగ్ తన కుమార్తెపై కిరాతకంగా ప్రతీకారం తీర్చుకున్నాడని జాస్మిన్ కౌర్ తల్లి ఆరోపణలు చేశారు. తన కుమార్తె తారిక్ జోత్ ను 100 సార్లకు పైగా నిరాకరించిందని చెప్పుకొచ్చారు. దీంతో జాస్మిన్ ను కిడ్నాప్ చేసి సజీవంగా గోతిలో పాతిపెట్టి దారుణంగా చంపాడని ఆమె వాపోయారు. తన కుమార్తెను నరకయాతనకు గురి చేసి అత్యంత దారుణంగా చంపిన తారిక్ జోత్ సింగ్ ను తాను ఎప్పటికీ క్షమించబోనని తెలిపారు. జాస్మిన్ ను అత్యంత కిరాతకంగా చంపిన తారిక్ జోత్ సింగ్ కు కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయని ప్రాసిక్యూటర్ వెల్లడించారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial