కోవిడ్ వైర‌స్ వ్యాప్తికి కార‌ణాల‌పై చాలాకాలం ప‌రిశోధ‌న‌లు సాగాయి. గ‌బ్బిలాల ద్వారా ఈ వైర‌స్ వ్యాపించింద‌ని ఇప్ప‌టివ‌ర‌కూ అంద‌రూ భావిస్తున్నారు. చైనాలోని వూహాన్ నుంచే ఈ వైర‌స్ ప్రారంభ‌మైంద‌ని ఆధారాలున్నా.. దానికి ఏ జీవి కార‌ణం అనే విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ స్ప‌ష్ట‌త‌లేదు. తాజాగా చైనాలోని వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న‌ రాకూన్ జాతి కుక్కల నుంచి కోవిడ్ వైరస్ వ్యాపించిందని అంతర్జాతీయ నిపుణుల బృందం ఆధారాలు కనుగొందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపుతోంది.


కోవిడ్ మహమ్మారి మూలాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్ర‌మంలో కోవిడ్ వైర‌స్ చైనాలోని వూహాన్‌లోని హువ‌నాన్‌ మార్కెట్ నుంచి రాకూన్ జాతి కుక్కల ద్వారా సంక్ర‌మించి ఉండవచ్చని అంతర్జాతీయ వైరస్ నిపుణుల బృందం పేర్కొంది. జనవరి 2020లో జన్యు డేటాను సేకరించడానికి ముందే.. వూహాన్‌ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్ దాని ప‌రిస‌ర ప్రాంతాల‌ను శుభ్రంచేశారు. చైనా అధికారులు మార్కెట్‌ను మూసివేసిన కొద్దిసేపటికే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం కొత్త వైరస్ వ్యాప్తికి సంబంధించిన అనుమానాలకు కార‌ణ‌మైంది.


మార్కెట్ నుంచి జంతువులను తొలగించినప్పటికీ, శాస్త్ర‌జ్ఞులు గోడలు, మెటల్ బోనులు, బండ్ల నుంచి జ‌న్యు న‌మూనాల‌ను సేకరించారు. పరీక్షల అనంతరం శాంపిల్స్‌లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విశ్లేషణలో పాల్గొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు సేక‌రించిన‌ జన్యు న‌మూనా జంతువులకు చెందినదని సూచించారు. అది స‌రిగ్గా రాకూన్ జాతి కుక్క అవ‌శేషాల‌కు సరిపోయింద‌ని ది అట్లాంటిక్ మ్యాగ‌జైన్ వెల్ల‌డించింది. కాగా.. వూహాన్ మార్కెట్ నుంచి సేకరించిన‌ జన్యు నమూనాలను గ్లోబల్ డేటాబేస్‌లో పొందుప‌రిచారు. శాస్త్రవేత్తలు వాటి గురించి చైనాను ప్రశ్నించిన తర్వాత ఆ న‌మూనాల‌ను తొలగించినట్లు నివేదిక పేర్కొంది.


అయితే రాకూన్‌ జాతి శున‌కం ద్వారానే వైరస్ సోకినట్లు ఏ ప‌రిశోధ‌నా నిరూపించలేదు. ఒక రాకూన్ కుక్కకు వైరస్ ఉన్నప్పటికీ, దాని ద్వారా మానవులకు సోకుతుందా లేదా అనే విష‌యంపై స్పష్టత‌ లేదు. వైరస్ మరొక జంతువు నుంచి కూడా ప్రజలకు సోకి ఉండవచ్చు.. లేదా వైరస్ సోకిన జంతువు నుంచి రాకూన్ జాతి కుక్కకు అది వ్యాపించి ఉండ‌వ‌చ్చ‌ని నివేదిక‌ పేర్కొంది.


అంతకుముందు.. కోవిడ్-19 "చైనా ప్రభుత్వ-నియంత్రిత ల్యాబ్‌"లోనే ఉద్భవించిందని ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ ( FBI) డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే బహిరంగంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత 'కొవిడ్ వ్యాప్తి కార‌కాల‌'పై విస్తృతంగా చర్చ జ‌రిగింది. అయితే, దీనిని ప్రతిస్పందనగా.. అమెరికా "రాజకీయ కోణంలో ఆరోప‌ణ‌లు" అని చైనా ఆరోపించింది. FBI డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ, యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రమేయంతో "వైర‌స్ మూలాలు క‌నుగొన‌డంలో రాజకీయం జ‌రిగింద‌ని" ఇందుకు తగిన ఆధారాలున్నాయ‌ని పేర్కొన్నారు.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా కోవిడ్ -19 వైరస్ మూలాల గురించి ఆధారాలు సేకరించి, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పంచుకోవాలని ప్రపంచ దేశాలను కోరింది. గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ కూడా కొవిడ్-19 వైరస్ కార‌కాల‌ గురించిన సమాచారంపై ఎవరినీ నిందించకూడ‌ద‌ని..  ఈ మహమ్మారి ఎలా వ్యాపించింద‌నే అంశంపై అవ‌గాహ‌న క‌ల్పించడం అవ‌స‌ర‌మ‌ని సూచించింది.