China Taiwan Tensions: అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనకు తైవాన్‌పై చైనా ప్రతీకారం తీర్చుకునేలానే కనిపిస్తోంది. ఇప్పటికే తైవాన్‌ను అష్టదిగ్బంధనం చేసిన చైనా తాజాగా సైనిక విన్యాసాలను ప్రారంభించింది. 


యుద్ధం తప్పదా?


చైనా సైన్యం, వైమానికదళం, నౌకాదళం, వివిధ అనుబంధ బలగాలతో కలిసి భారీ ఎత్తున సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాలు తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ జరుగుతున్నాయి. గురువారం నుంచి ఆదివారం వరకు ఈ డ్రిల్స్ కొనసాగనున్నట్లు చైనా ప్రకటించింది.


చైనా సైనిక విన్యాసాలు చేస్తుండటంతో తైవాన్ అప్రమత్తమైంది. తమ దేశ సైన్యాన్ని హై అలర్ట్​ చేసింది. అమెరికా నావికాదళం తైవాన్​కు సమీపంలో పలు నౌకలను మోహరించింది.


27 ఫైటర్ జెట్స్






27 చైనా విమానాలు ఆగస్టు 3న తైవాన్‌ గగనతలంలోకి ప్రవేశించాయి. ఆరు జే11 ఫైటర్‌ జెట్స్‌, 5 జే16 జేట్స్‌ 16 ఎస్‌యూ-30 జేట్స్‌ ప్రవేశించినట్లు తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. వాటికి ప్రతిస్పందనగా తైవాన్‌ సైతం తమ ఫైటర్‌ జెట్స్‌ను రంగంలోకి దించింది.  


స్వతంత్ర ప్రాంతంగా మనుగడ సాగిస్తున్న తైవాన్‌ను ప్రధాన భూభాగంలో కలుపుకునేందుకు ఎప్పటి నుంచో చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ మాత్రం స్వతంత్ర దేశంగానే ఉండాలని కోరుకుంటోంది.


ఆంక్షలు


తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా హౌస్‌ స్పీకర్ నాన్సీ పెలోసీకి తైవాన్ ఆతిథ్యం ఇవ్వడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్‌పై ఆంక్షల కొరడా ఝుళిపించింది. తైవాన్ నుంచి దిగుమతి చేసుకునే పండ్లు, చేప‌ల‌పై ఆంక్ష‌లు విధించింది. ఇక తైవాన్ ద్వీపానికి పంప‌నున్న ఇసుక ర‌వాణాను నిలిపివేస్తున్న‌ట్లు చైనా ప్ర‌క‌టించింది.


వీటిపై


సిట్ర‌స్ జాతికి చెందిన కొన్ని ర‌కాల పండ్లు, చేప‌ల దిగుమ‌తిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు చైనా క‌స్ట‌మ్స్ శాఖ తెలిపింది. పండ్లు, చేప‌ల్లో క్రిమిసంహార‌కాలు ఎక్కువ శాతం ఉంటున్నాయ‌ని పేర్కొంది. కొన్ని ప్యాకెట్ల‌లో క‌రోనా టెస్టు పాజిటివ్ వ‌స్తుంద‌ని క‌స్ట‌మ్స్ శాఖ తెలిపింది. 


Also Read: Patra Chawl Scam Case: సంజయ్‌ రౌత్‌కు కస్టడీ పొడిగింపు- ఆ కేసులో ED పురోగతి