Brooklyn Subway Shooting: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మారణ హోమాన్ని సృష్టించిన నిందితుడు ఫ్రాంక్ ఆర్ జేమ్స్ (62) పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడుని గుర్తించిన న్యూయార్క్ పోలీసులు ఫోటులు విడుదల చేశారు. అనంతరం అతన్ని పట్టుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని ఈస్ట్ విలేజ్ పరిసరాల్లో పెట్రోల్ అధికారులు జేమ్స్‌ను అరెస్టు చేశారు. పోలీసులు మొదట్లో ఆయన్ని అనుమానితుడిగానే అనుకున్నారు. ఆయన కొనుగోలు చేసిన గన్... సంఘటనా స్థలం వద్ద ఉన్న గన్ ఒక్కటే అవ్వడంతో ఆయనే హంతకుడిగా నిర్దారించారు.
అనంతరం సబ్ వే వద్ద కాల్పులు జరిపిన నిందితుడిగా జేమ్స్‌ను పేర్కొని ఫొటోలు, వివరాలు పోలీసులు, అధికారులు విడుదల చేశారు. ఫ్రాంక్ ఆర్ జేమ్స్ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ సబ్ వే వద్ద మంగళవారం కాల్పులు జరిపాడని ప్రకటించారు. నిందితుడి స్వస్థలం ఫిలడెల్ఫియా అని గుర్తించినట్లు చెప్పారు.
ఫ్రాంక్ ఆర్ జేమ్స్ ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపాడని, అందుకోసం ఓ వ్యాన్‌ను కూడా అద్దెకు తీసుకున్నాడు. ఆపై సబ్ వే వద్ద తుపాకీతో ఒక్కసారిగా కాల్పులు జరిపి భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశాడని అధికారులు తెలిపారు. నిందితుడు జేమ్స్ ఫొటోలను విడుదల చేసిన అనంతరం అతడి ఆచూకీ తెలపాలని ఎన్‌వైపీడీ చీఫ్ డిటెక్టివ్ జేమ్స్ ఇస్సిగ్ ప్రజలను కోరారు. ప్రజలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు జేమ్స్‌ను పట్టుకున్నారు.
బ్రూక్లిన్‌లోని సన్‌సెట్ పార్క్ పరిసరాల్లోని 36వ స్ట్రీట్ స్టేషన్‌కు వెళుతున్న రద్దీగా ఉండే సబ్‌వే రైలుపై జేమ్స్.. స్మోక్ గ్రెనేడ్‌ను పేల్చి, తుపాకీతో 33 సార్లు కాల్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ దాడిలో 10 మందితో సహా 29 మంది గాయపడ్డారు. అయితే గాయాలు ఏవీ ప్రాణాంతకమైనవి కావన్నారు అధికారులు. బాధితుల్లో ఐదుగురు పాఠశాలకు వెళ్తున్నారని తెలిపారు.
కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా పరిశోధించడం లేదని, అయితే అధికారులు దేన్నీ తోసిపుచ్చలేదని NYPD కమిషనర్ కీచంట్ సెవెల్ తెలిపారు.