Sheik Hasina Bangladesh: బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో భారీ దోపిడీ జరిగింది. గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్ల వేళ ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వేలాది మంది నిరసన కారులు ప్రధాని ఇంటిని ముట్టడించారు. ప్రధాన ద్వారం గేట్లు దూకి వందల మంది ప్రధాని నివాసపు కాంపౌండ్ లోకి ప్రవేశించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ఇంట్లోకి చొరబడి లోపల మొత్తం లూటీ చేశారు. ఎన్నో రకాల వస్తువులను ఎత్తుకెళ్లారు. విలువైన ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ప్రధాని నివాసంలో ఉన్న చికెన్, చేపలు, కూరగాయలను కూడా వదలకుండా మొత్తం ఎత్తుకుపోయారు. చాలా మంది విలువైన వస్తువులు తీసుకెళ్తున్నట్లుగా వీడియోలు వైరల్ అయ్యాయి.
షేక్ హసీనా దేశం విడిచి పారిపోయినందున నిరసన కారులు ఆనందం వ్యక్తం చేస్తూ జెండాలు ఊపుతూ వీధుల్లోకి వచ్చారు. అంతేకాక, ఢాకాలో ఆర్మీ మోహరించిన యుద్ధ ట్యాంకుల పైకి ఎక్కి, పలువురు నిరసన కారులు డ్యాన్సులు కూడా చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
బంగ్లాదేశ్ సివిల్స్ ఉద్యోగుల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు కదం తొక్కిన సంగతి తెలిసిందే. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి వారసులకు 30 శాతం కోటా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018లోనే దీన్ని అమలు చేయాలని భావించినా.. వ్యతిరేకత కారణంగా వెనక్కి తగ్గారు. జూన్‌లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో కోటాను పునరుద్ధరిస్తూ తీర్పు రావడంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.