న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ లో హింస చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పదవికి రాజీనామా చేయాలని షేక్ హసీనాపై ఒత్తిడి పెరగడంతో బంగ్లాదేశ్ ప్రధానిగా ఆమె సోమవారం రాజీనామా చేశారు. అనంతరం దేశంలో రక్షణ ఉండదన్న కారణంగా భారత్ కు వచ్చారు. అగర్తలాలో ల్యాండ్ అయినా షేక్ హసీనాకు భారత్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు తాత్కాలికంగా సహాయం, రక్షణ కల్పించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. కానీ షేక్ హసీనాకు భారతదేశంలో ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినట్లు సమాచారం. నరేంద్ర మోదీ ప్రభుత్వం హసీనాకు రక్షణ కల్పించి, ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా లేదని ఏబీపీ న్యూస్ కు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. దాంతో షేక్ హసీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె భారత్ నుంచి యూరప్ దేశాలకు వెళ్లనున్నారు. యూరప్ లో ఫిన్లాండ్ లేక స్విట్జర్లాండ్ దేశాలకు షేక్ హసీనా వెళ్లిపోతారని ప్రాథమికంగా సమాచారం అందుతోంది. 


హసీనాకు భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారా? మాజీ రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చారు. అయితే భారత్ షేక్ హసీనాకు ఆశ్రయం కల్పిస్తుందా అనే విషయంపై మాజీ విదేశాంగ కార్యదర్శి, బంగ్లాదేశ్‌లో మాజీ రాయబారి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా ANI మీడియాతో మాట్లాడారు. ‘ఈ విషయానికి సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే షేక్ హసీనా 1975 నుంచి 1979 వరకు భారత్ లోనే ఆశ్రయం పొందారు. ఆ సమయంలో భారత్ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్యకు గురైన అనంతరం షేక్ హసీనా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేను. అయితే షేక్ హసీనా తలదాచుకునేందుకు ఇతర దేశాలు చాలా ఉన్నాయని’ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


 






షేక్ హసీనా అగర్తలా నుంచి C 130-J Herculesలో న్యూఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి లండన్, ఫిన్లాండ్ లేక స్విట్జర్లాండ్ లకు వెళ్లిపోయే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి భారీగా ప్రజలు సరిహద్దు దాటి భారత్ లోకి ప్రవేశిస్తారని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఫల్బరీ లోని భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ICP) దాటి కొందరు భారత్ లోకి వస్తున్నారు. షేక్ హసీనా రాజీనామా అనంతరం కొందరు పౌరులు పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి నుంచి బంగ్లాదేశ్ బార్డర్ దాటి భారత్ లోకి ప్రవేశిస్తున్నారు.


Also Read: Sheikh Hasina News: దేశం విడిచిపెట్టి భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని, అక్కడ సైనిక పాలన - త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం!