Dhaka Explosion: బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు సంబంధించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక భవనంలో జరిగిన పేలుడులో 14 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. పేలుడుకు కారణం అస్పష్టంగా ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
భారీ పేలుడు
ఓల్డ్ ఢాకాలోని సిద్ధిక్ బజార్‌లోని ఓ భవనంలో భారీ పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు. 100 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం మంగళవారం సాయంత్రం 4:50 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) పేలుడు సంభవించింది. ఐదు అగ్నిమాపక యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా తెలిపిన వివరాల ప్రకారం, క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని బచ్చు మియా చెప్పారు. అయితే భవనంలో ఎటువంటి మంటలు చెలరేగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. శానిటరీ ఉత్పత్తులను విక్రయించే అనేక దుకాణాలు ఉన్న ఏడు అంతస్తుల భవనం దిగువ అంతస్తులో పేలుడు సంభవించింది.
రెండు కిలోమీటర్ల వరకూ వినిపించిన పేలుడు శబ్దం
BRAC బ్యాంక్‌లో కొంత భాగం దానికి సమీపంలోని నిర్మాణంలో ఉందని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. పేలుడు ధాటికి కర్టెన్లు చీలిపోయి బ్యాంకు అద్దాలు పగిలిపోయాయి. రోడ్డుకు అవతలి వైపు ఉన్న బస్సు కూడా ధ్వంసమైంది. పేలుడుకు గల కారణాలను అగ్నిమాపక శాఖ ఇంకా నిర్ధారించలేదు. అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ దీన్ మోని శర్మ మాట్లాడుతూ... సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. స్థానిక ప్రభుత్వ అధికారి షాహదత్ హుస్సేన్ మాట్లాడుతూ, ఆరు మృతదేహాలను సైట్ నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రత్యక్ష సాక్షి నయ్‌హనుల్ బారీ అనే పోలీసు అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం పేలుడు సమయంలో రెండు కిలోమీటర్ల మేర భారీ శబ్దం వినిపించింది. గతేడాది జూన్‌లో ఈ ప్రాంతంలోని కంటైనర్ డిపోలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందగా దాదాపు 200 మంది గాయపడ్డారు.