Sheikh Hasina: రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. విద్యార్థుల నిరసనల కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వదిలి వెళ్లిపోయేలా చేసింది. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో నాలుగైదు వందల మందికిపైగా అమాయకులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు అదుపులోకి రాలేదు. బంగ్లా నుంచి పారిపోయిన ఇప్పటికైతే భారత్ లో ఆశ్రయం పొందారు. ఇదిలా ఉండగా.. షేక్ హసీనా పై బంగ్లా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
హసీనా వల్లే అతడి మరణం
గత నెలలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో కిరాణా దుకాణం యజమాని మరణించినందుకు బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు నమోదైంది. వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్ల వ్యవస్థపై అవామీ లీగ్ నేతృత్వంలోని తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనల నేపథ్యంలో గత వారం రాజీనామా చేసి భారతదేశానికి వచ్చిన తరువాత హసీనా (76)పై నమోదైన మొదటి కేసు ఇది. జూలై 19 న మొహమ్మద్‌పూర్‌లో రిజర్వేషన్ ఉద్యమానికి మద్దతుగా చేపట్టిన ఊరేగింపులో పోలీసు కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబు సయ్యద్ ఈ అల్లర్లలో చనిపోయాడు. అతని మరణానికి షేక్ హసీనా నే కారణమంటూ అతడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షేక్ హసీనాతో పాటు, మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. వీరిలో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ , మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా అల్ మామున్ సహా మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది.
తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 230 మందికి పైగా మరణించారు. కోటా వ్యతిరేక నిరసనలు జూలై మధ్యలో ప్రారంభమైనప్పటి నుండి హింసలో మరణించిన వారి సంఖ్య 560కి చేరుకుంది. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో 84 ఏళ్ల నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనస్ తో పాటు మరో 16 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
బంగ్లాదేశ్ హిస్టరీ, మిస్టరీ
1971లో బంగ్లాదేశ్ విముక్తిలో పాల్గొన్న వారి కుటుంబాలకు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని షేక్ హసీనా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిరుద్యోగులు దీనికి అంగీకరించలేదు. ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో నిరసనలు చిలికి చిలికి గాలివానలా మారాయి. ఆందోళనకారులు ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. దీంతో ఆర్మీ వారితో సంప్రదింపులు జరుపనుంది. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయవాదులు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని ఇటీవల ఆందోళనకారులు సూచించారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా కూడా ఈ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ నేతలు కూడా భారత్‌ను కోరారు. ఈ క్రమంలో షేక్ హసీనాపై హత్య కేసు నమోదు కావడంతో మరోసారి బంగ్లా రాజకీయం హాట్ హాట్ గా మారిందని చెప్పవచ్చు.