Weather Report: యాగి తుపాను తీవ్రత నుంచి కోలుకుంటున్న చైనాను మరో భారీ టైఫూన్ బెబింకా ఇప్పుడు వణికిస్తోంది. గడచిన 70 ఏళ్ల వ్యవధిలో ఈ స్థాయి తుపానును చూడని చైనా ఆర్థిక నగరం షాంఘై.. చిగురుటాకులా వణుకుతోంది. సోమవారం ఉదయం నగరాన్ని తాకిన తుపాను 150 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ నగరంలో బీభత్సం సృష్టిస్తోంది. బెబింకా ధాటికి షాంఘై నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేయగా.. వందలాది విమానాలు విమానాశ్రయాల్లోనే నిలిచి పోయాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి షాంఘైలోని రెండు విమానాశ్రయాలను మూసి వేశారు. గేట్‌ వే ఆఫ్‌ ది యాంగ్జ్‌టీ రివర్‌గా పిలిచే చోంగ్‌మింగ్ ఐలాండ్ నుంచి ఫెర్రీల రాకపోకలు నిలిపేశారు. ట్రైన్ సర్వీసులను కూడా ఈ టైఫూన్ తీవ్రంగా దెబ్బ తీసింది. సినిమా హాళ్లు ఇతర ఫన్ ప్రదేశాలను, జంతు ప్రదర్శన శాలలను అన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తూ షాంఘై అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాదారణంగా షాంఘై సిటీని తుపానులు అతి తక్కువగానే తాకుతుంటాయి. 1945 లో బీభత్సం సృష్టించిన గ్లోరియా తుపాను తర్వాత ఆ స్థాయిలో షాంఘైపై విరుచుకు పడిన తుపాను బెబింకానేనని చైనా వాతవరణ శాఖ తెలిపింది.  






తీరం దాటిన తర్వాత మరింత ప్రమాదకరంగా పరిస్థితులు:


షాంఘై పరిధిలోని పుడోంగ్ జిల్లా పరిధిలో బెబింకా తీరం దాటగా ఆ సమయంలో సెకనుకు 47 మీటర్ల వేగంతో గాలులు వీచాయని అధికారులు తెలిపారు. షాంఘై, జెజియాంగ్‌లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన యంత్రంగా సహాయ చర్యలు ముమ్మరం చేసింది. బెబింకా బీభత్సానికి వేలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెండున్నర కోట్ల జనాభా ఉండే షాంఘై నగరానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు అదికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రజలందరు ఇళ్లలోనే ఉండాలని సూచించిన అధికారులు చోంగ్‌మింగ్ ప్రాంతం నుంచి 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Also Read: డైవర్స్ ఫెర్ఫ్యూమ్‌- మరో సంచలనం సృష్టించిన దుబాయ్‌ యువరాణి మహ్‌రా 


కొద్ది రోజుల క్రితం హెనాన్ ప్రావిన్స్‌లో యాగీ తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో బెంబేలెత్తించింది.  విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. మొబైల్‌ ఫోన్‌లకు ఛార్జింగ్‌ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఫలితంగా ప్రజలు డిజిటల్ చెల్లింపులు కూడా చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతలోనే ఇప్పుడు బెబింకా తుపాను బీభత్సం సృష్టించింది.


టైఫూన్‌ యాగి ధాటికి తీవ్రంగా నష్టపోయిన వియత్నాం, లావోస్‌, మయన్మార్‌కు భారత్ సాయం:


ఆపరేషన్ సద్భావ్ పేరిట భారత్‌కు చెందిన యుద్ధనౌక INS సత్పుర.. ఈ దేశాలకు విపత్తు సహాయ సామగ్రిని తీసుకొని బయలు దేరినట్లు ఈస్ట్రన్ నావవ్‌ కమాండర్ తెలిపారు. యాగీ తీవ్రతతకు వియ్నాంలో 170 మంది, మయన్మార్‌లో 40 మంది మృత్యువాత పడ్డారు. వియత్నాంకు లక్ష డాలర్ల విలువైన సామగ్రిని, లావోస్‌కు కూడా అంతే మొత్తంలో పంపినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.


Also Read: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం