అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మంగళవారం (ఏప్రిల్ 4) పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిమినల్ కేసు విచారణ నిమిత్తం డొనాల్డ్ ట్రంప్ మాన్ హట్టన్ కోర్టుకు వచ్చారు. అడల్ట్ స్టార్ కేసులో ఈ మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ఆమోదం తెలిపింది.
2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు సైలెంట్ చేసేందుకు అడల్ట్ సినీ స్టార్స్‌కు డబ్బులు చెల్లించారనే ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో విచారణ అనంతరం ఆయన్ని బెయిల్‌పై విడుదల చేశారు.
అరెస్టు అనంతరం కోర్టు సిబ్బంది ట్రంప్ ఫొటోలు, వేలి ముద్రలు సేకరించారు. ఆయన్ని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్‌నట్టు కోర్టు పరిగణించింది. తనపై వస్తున్న ఆరోపణలు కక్ష సాధింపులో భాగమే అంటున్నారు ట్రంప్. తనను అరెస్టు చేయబోతున్నారని... అమెరికాలో ఇలాంటివి జరగబోతుననాయే నమ్మకం కుదరడం లేదున్నారు.
చరిత్రలో తొలిసారి..
ట్రంప్ రాకకు ముందు కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎనిమిది కార్ల కాన్వాయ్ లో ట్రంప్ కోర్టుకు వచ్చారు. క్రిమినల్ విచారణను ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే.
రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ సోమవారం ఫ్లోరిడా నుంచి బయలుదేరే ముందు ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో తనను నిరంతరం వేధిస్తున్నారని రాశారు. స్టార్మీ డేనియల్స్ కు డబ్బు చెల్లించడంలో ఎలాంటి తప్పు జరగలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది.
ఆరోపణలను ఖండించిన డొనాల్డ్ ట్రంప్
అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 2016 అక్టోబర్ చివరిలో డేనియల్స్‌కు అప్పటి వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కోహెన్ 1,30,000 డాలర్లు చెల్లించారు. దశాబ్దం క్రితం ట్రంప్‌తో తనకున్న సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు డేనియల్స్‌కు ఈ డబ్బు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు.
కోర్టును నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. తన దేశం కోసం ధైర్యంగా నిలబడి నందుకే ఈ వేధింపులని అధికార పార్టీని విమర్శించారు.
హాజరు కావడానికి ముందు మద్దతుదారులకు ఇమెయిల్స్ పంపారు
కోర్టుకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు ఈమెయిల్ పంపారు. అరెస్టుకు ముందు ఇదే చివరి ఈమెయిల్ అని అందులో పేర్కొన్నారు. అమెరికా మార్క్సిస్ట్ థర్డ్ వరల్డ్ దేశంగా మారుతోందని ఆయన అన్నారు. 'ఈ రోజు అమెరికాలో న్యాయం జరగకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. ఒక అధికార రాజకీయ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి నేరం చేయకపోయినా అరెస్టు చేసే రోజు ఇది.
మీ మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన తన ఈ-మెయిల్ లో పేర్కొన్నారు. తనకు లభించిన మద్దతు మరిచిపోలేనని అన్నారు. అయితే జరుగుతున్నది చూస్తుంటే బాధగా ఉందన్నా ఆయన దీన్ని తన కోసం కాకుండా దేశం కోసం భరిస్తున్నట్టు చెప్పారు.