ఆరు నెలల క్రితం ఆయన ఓ దేశానికి ఆర్థిక మంత్రి.. కానీ ఇప్పుడు మరో దేశంలో క్యాబ్ డ్రైవర్. ఆయన కథ వింటే మనకు విధి ఎంత విచిత్రమైనదో అర్థం అవుతుంది. ఆయనే ఖలీద్ పయోండా. 


ఆర్థిక మంత్రిగా


ఖలీద్‌ పయెండా ఆరు నెలల క్రితం అఫ్గానిస్థాన్ ఆర్థికమంత్రి. వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను నిర్వహించిన వ్యక్తి. ఆర్థికమంత్రిగా సౌకర్యవంతమైన జీవనం గడుపుతోన్న ఖలీద్‌ పరిస్థితి.. తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకోవడం వల్ల ఒక్కసారిగా మారిపోయింది.


అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమిం‌చుకోవడంతో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పయెండా దేశం విడిచి అమెరికాకు శరణార్ధిగా వచ్చారు. కాబుల్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకోడానికి వారం రోజుల ముందే ఘనీతో విభేదాల కారణంగా ఖలీద్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు.


క్యాబ్ డ్రైవర్‌గా


అఫ్గాన్ నుంచి ప్రాణభయంతో అమెరికా వచ్చిన ఖలీద్.. వాషింగ్టన్ డీసీలో ఉబర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ఆరు గంటల పనికి 150 డాలర్లకు పైగా సంపాదిస్తున్నానని చెప్పారు.


దీంతోపాటు జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలోని వాల్ష్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫారెన్‌ సర్వీసెస్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఆయన పనిచేస్తున్నారు. అఫ్గాన్‌ను తాలిబన్లు అక్రమించడం వల్ల.. తనకు ఒక స్వస్థలం అంటూ లేకుండా పోయిందని ఖలీద్‌ ఆవేదన వ్యక్తం చేశారు.


అఫ్గాన్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోలేపోయానని వాపోయారు. దేశంలో ప్రజస్వామ్యాన్ని నిలబెడ్డటంలో విఫమయ్యామని ఒప్పుకున్నారు. ప్రస్తుత అఫ్గాన్ పరిస్థితికి అమెరికాయే కారణమని ఆయన అన్నారు. ఎందుకంటే సైన్యాల ఉపసంహరణతో తాలిబన్లకు ఆక్రమించుకోడానికి అమెరికా పరోక్షంగా అనుమతించిందని తెలిపారు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించకపోవడంతో అఫ్గాన్‌ ప్రస్తుతం ఆర్ధిక, మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.


తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్థాన్‌ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అక్కడ నెలకొన్న పరిస్థితులు చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే పోషకాహర లోపంతో 10 లక్షల మంది చిన్నారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్‌ వెల్లడించింది. అంతేకాకుండా ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ చర్యలు చేపట్టకుంటే చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.


Also Read: Watch Video: కుర్రాడు 'బంగారం' అండి! పని చేసి 10 కిమీ పరిగెత్తి ఇంటికెళ్తాడు!


Also Read: China Plane Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం, 132 మంది మృతి!