"ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి


విశ్రమించవద్దు ఏ క్షణం- విస్మరించవద్దు నిర్ణయం


అప్పుడే నీ జయం నిశ్చయంరా.."


సినీ వినీలాకాంశంలో అరుణోదయ తారకలా మెరిసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలు వారిన ముత్యాలు.. ఈ మాటలు. ఈ మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఈ అక్షర సత్యాలైన మాటలకు నిలువెత్తు రూపంలా కనిపించాడు ఓ కుర్రాడు.


నోయిడా రహదారిపై ప్రతిరోజు రాత్రి ఓ 19 ఏళ్ల కుర్రాడు పరిగెడుతున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ కుర్రాడ్ని గుర్తించి.. ఎందుకు పరిగెడుతున్నాడో అడిగి తెలుసుకున్నారు జాతీయ అవార్డు గ్రహీత ఫిల్మ్‌మేకర్‌ వినోద్ కాప్రీ. అయితే ఆ కుర్రాడి మాటలు విని డైరెక్టర్ షాకయ్యారు. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆ కుర్రాడు 'బంగారం' అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఏముందో మీరూ చూడండి.




వినోద్ కాప్రీ: హలో.. మీ ఇంటి దగ్గర దింపేస్తాను ఇలా రా


యువకుడు: లేదు లేదు. నేను ఇలాగే పరిగెత్తుకుంటూ వెళ్తా.


వినోద్ కాప్రీ: ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావ్? ఏం పనిచేస్తావ్?


యువకుడు: నేను పరిగెత్తుకుంటూనే వెళ్తా. సెక్టార్ 16లోని మెక్​డొనాల్డ్స్​లో పనిచేస్తా. పరిగెత్తేందుకు నాకు ఇప్పుడే సమయం దొరుకుతుంది. ఆర్మీలో చేరేందుకు నేను పరిగెడుతున్నా. పొద్దున పరిగెత్తేందుకు నాకు సమయం దొరకదు. ఇంట్లో వంట, ఇతర పునులు పూర్తి చేసుకొని మెక్​డొనాల్డ్స్​కు వెళ్లాల్సి ఉంటుంది.


వినోద్ కాప్రీ: నీ పేరేంటి? నీ అమ్మనాన్న ఏం చేస్తారు?


యువకుడు: నా పేరు ప్రదీప్ మెహ్రా. మా స్వస్థలం ఉత్తరాఖండ్​లోని అల్మోడా. మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు. ఆస్పత్రిలో ఉంది. నేను నా సోదరుడితో కలిసి ఇక్కడ ఉంటున్నా.


వినోద్ కాప్రీ: లిఫ్ట్ వద్దన్నావ్.. పోనీ కనీసం డిన్నర్ కోసమైనా మా ఇంటికి రా.


యువకుడు: నా సోదరుడు నైట్ డ్యూటీకి వెళ్తాడు, త్వరగా ఇంటికి వెళ్లి ఇద్దరి కోసం నేనే వంట చేయాలి. 


వినోద్ కాప్రీ: ఈ వీడియో వైరల్ అవుతుంది.


యువకుడు: నన్నెవరు గుర్తుపడతారు (నవ్వుతూ). ఒకవైళ వైరల్ అయినా.. నేనేమీ తప్పు చేయడం లేదు కదా.


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎంతో మంది యువతకు ప్రదీప్ ప్రేరణగా నిలుస్తాడని సెలెబ్రెటిలీ కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రదీప్ నీకు 'దేశం' సలాం.