బోధన్‌లో జరిగిన అల్లర్లుపై పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ అల్లర్లు కావాలనే సృష్టించారని దర్యాప్తులో తేలినట్టు వెల్లడించారు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాత్రికి రాత్రే శివాజీ విగ్రహం ప్రతిష్ట జరిగిపోవడంతో దుమారం రేగింది. దీన్ని వ్యతిరేకించిన వాళ్లంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీన్ని బీజేపీ, శివసేన నేతలు తప్పుపట్టారు.
దీని వెనుక కుట్రకోణం ఉందంటున్నారు పోలీసులు. రెండు రోజులుగా అందర్నీ విచారించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. దీని వెనుక ఉన్న వారిని బయటకు తీసుకొస్తామంటున్నారు ఐజీ కమలాకర్‌రెడ్డి. కావాలనే ఇదంతా చేశారని ఆయన పేర్కొన్నారు.
శివసేనకు చెందిన గోపి అనే వ్యక్తి హస్తం ఈ కుట్రలో ఉందన్నారు నిజామాబాద్ ఐజీ. శివాజీ విగ్రహాన్ని నిజామాబాద్‌జిల్లాలోని బోధన చౌరాస్తాలో ఏర్పాటు చేయాలని మున్సిపల్ కౌన్సిల్‌లో కొందరు అభ్యర్థించారు. దీనిపై ఓ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే ఎప్పుడు ప్రతిష్టించాలనే విషయంపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
శివాజీ విగ్రహ ప్రతిష్టపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా గోపీ అనే వ్యక్తి మాత్రం తొందర పడినట్టు చెప్పారు పోలీసకులు. శరత్ అనే కౌన్సిలర్ సహాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. వారం క్రితం గోపి, శరత్ కలిసి విగ్రహం ఏర్పాటుకు ప్లాన్ చేశారని వెల్లడించారు. కావాలనే విగ్రహాన్ని రాత్రికి రాత్రి ఏర్పాటు చేశారని వివరించారు.ఇది పట్టణంలో అలజడికి కారణమైందంటున్నారు పోలీసులు. ఇలాంటి అల్లర్లును ప్రోత్సహించిన వ్యక్తులను వదలబోం అంటున్నారుఐజీ నాగిరెడ్డి
రాత్రికి రాత్రే పట్టణంలోని ప్రధాన జంక్షన్‌లో ఎలాంటి పర్మిషన్ లేకుండా శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఓ వర్గాం వ్యతిరేకించింది. అలాంటి విగ్రహం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ వర్గం ఆందోళన బాట పట్టింది. దానికి వ్యతిరేకంగా బీజేపీ, శివసేన ఆందోళన బాటపట్టాయి. బీజేపీ, శివసేన కార్యకర్తలు, మైనార్టీ నాయకులు భారీగా అంబేడ్కర్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఒక సమయంలో ఆగ్రహంతో ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపుచేసుందుకు పోలీసులను భారీగా మోహరించారు.
ఒక్కసారిగా పట్టణంలో అలజడి రేగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు పట్టణంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. నాయకులు కూడా ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిన్న జరిగిన ఘటనపై 147మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. నగరంలో 144సెక్షన్ అమలులో ఉంది.