Revanth Reddy : రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి చివరి ధాన్యపు గింజ కొనే వరకూ కాంగ్రెస్(Congress) పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(TPCC President Revanth Reddy) అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో "మన ఊరు- మన పోరు" బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుంటే రైతులతో కలిసి కేసీఆర్ ఫామ్ హౌస్(KCR Farm House)ను ముట్టడిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు రెండు సార్లు అధికారం ఇస్తే ఇనాళ్లు ఏంచేయకుండా ఇప్పుడు దిల్లీ వెళ్లి పోరాడతానని ఉపన్యాసాలు ఇస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలో చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీలు ఇచ్చిన కవిత(Kavita) ఎంపీగా గెలిచాక ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌పై రాసిచ్చిన బీజేపీ ఎంపీ అర్వింద్(MP Arvind) ఆ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పసుపు బోర్డు(Turmaric Board) రాక పసుపు రైతులు, గిట్టుబాటు ధర లేక జొన్న రైతులు, వరి వద్దన్నంటున్న కేసీఆర్ ప్రకటనలతో నిజామాబాద్ జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదనలో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
పసుపు బోర్డు ఎక్కడ?
2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో 10 వేల కోట్లు పెట్టి రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంపై నెపం నెట్టేందుకు మరోసారి దిల్లీకి బయలుదేరారని మండిపడ్డారు. వరి పండించిన రైతులను మోసం చేస్తే ఎల్లారెడ్డి నడిబజార్ లో ఉరితీస్తామని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు పోరాటం చేసి ఆ చట్టాలను రద్దు చేసేవరకు పోరాడారన్నారు. అలాంటి పోరాటమే ఎల్లారెడ్డి రైతులు చేయాలన్నారు. కవిత ఎంపీగా పోటీ చేసిన సమయంలో వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్నారు. కానీ 1500 రోజులు అయిన ఆ షుగర్ ఫ్యాక్టరీని తెరవలేదన్నారు. ఎంపీ అర్వింద్ ఇలాగే పసుపు బోర్డు తెస్తానని మోసం చేశారన్నారు.
ఎమ్మెల్యే సురేందర్ అమ్ముడుపోయారు
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న కేసీఆర్(KCR).. ఆ నీళ్లతో ఏం పండించమంటారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతులు పండించిన పంటలను కొనమంటే రైతులు ఏమవ్వాలన్నారు. రాష్ట్రంలోని 7,500 ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజను కొనాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అత్యధిక మెజార్జీతో గెలుస్తుందని రేవంత్ జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే సురేందర్ ను కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తే కేసీఆర్‌కు అమ్ముడుపోయారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 'కల్లాల్లో కాంగ్రెస్' కార్యక్రమాన్ని పార్టీ నేతలు విజయవంతం చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సభలో అజారుద్దీన్, అంజన్ కుమార్, మల్లురవి, ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.