అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోకి తాలిబన్లు అడుగు పెట్టారు. కాబూల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అఫ్గాన్‌ ప్రభుత్వం కూడా తాలిబన్లతో పోరాడలేక లొంగిపోయింది. తాలిబన్లు కాబూల్‌పై ఎలాంటి దాడి చేయలేదని, అధికారి మార్పు అవసరమైతే శాంతియుతంగా జరుగుతుందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు అమెరికా తమ దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది.




తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లోని 34 రాష్ట్ర రాజధానుల్లో కేవలం కాబూల్‌ మరో ఐదింటిని మాత్రమే ఇంకా ఆక్రమించుకోలేదు. నేటితో అది కూడా పూర్తయింది. దీంతో దౌత్యవేత్తలను వాహనాల్లో తరలించారు. ఆ తర్వాత అమెరికా దౌత్య కార్యాలయంపై నల్లటి పొగ కనిపించింది. చెక్‌ రిపబ్లిక్‌ కూడా తమ దౌత్యవేత్తలను కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించింది. మరోపక్క కాబూల్‌లో బ్యాంకుల్లో నుంచి తాము దాచుకొన్న నగదు తీసుకోవడానికి ప్రజలు బారులు తీరారు. ఇప్పటికే ఏటీఎంలు పనిచేయడం లేదు.




చినూక్‌ హెలికాప్టర్లు అమెరికా దౌత్య కార్యాలయం పైకి చేరుకొన్నాయి. ఇక్కడి నుంచి దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమం మొదలుపెట్టింది. దీనిపై అఫ్గాన్‌ ప్రభుత్వం కానీ,  తాలిబన్లు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా ఇళ్లకు పంపించారు. కాబూల్‌ గగనతలంలో సైనిక హెలికాప్టర్ల హడావుడి పెరిగిపోయింది.  




కాబూల్ లోకి రావడం కంటే ముందే తాలిబన్లు జలాలాబాద్ అనే నగరాన్ని తమ అధీనంలో తీసుకున్నారు. అక్కడ ప్రజలు నిద్రలేచేసరికే తాలిబన్ జెండాలు కనిపించాయి. ఈ జలాలాబాద్ కాబుల్ నగరానికి తూర్పు దిశగా ఉంటుంది. అంతేకాక, జలాలాబాద్ గుండానే పాకిస్థాన్‌కు వెళ్లే ప్రధాన సరిహద్దు ఉంది. అలాంటి కీలకమైన జలాలాబాద్‌కు తాలిబన్లు తమ హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం కాబుల్ శివారులో ఉన్న తాలిబన్ మూకలు అక్కడి నుంచి ఏ క్షణంలోనైనా నగరంలోకి ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జలాలాబాద్‌ తమ గుప్పిట్లో ఉందని చాటుతూ తాలిబన్లు ఆదివారం తాము గవర్నర్ కార్యాలయంలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. 


Also Read: తల్లిని షూట్ చేసిన పసివాడు.. జూమ్ వీడియో కాల్‌లో రికార్డైన దారుణ ఘటన


జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని అష్రఫ్ ఘనీ
తాలిబన్ల అక్రమ చొరబాటు ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ జాతినుద్దేశించి శనివారం మాట్లాడారు. ఆ ప్రసంగంలో ఆయన మరింతగా ఒంటరి తనంగా ఫీలవుతున్నట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు రాశాయి. మరింత రక్తపాతం జరగనివ్వనని.. దేశంలో శాంతి, సుస్థిరతల స్థాపనపై దృష్టి సారిస్తానని ఆయన అన్నారు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోకుండా ఆపాల్సి ఉందని అష్రఫ్ ఘనీ అన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన చర్చలు జరిపిన అఫ్గాన్ సైనికులు తాలిబన్లకు లొంగిపోయారు. దీంతో అష్రఫ్ ఘనీకి సైనిక ఎంపిక లేకుండా పోయింది. తాలిబన్ కార్యాలయం ఉన్న ఖతర్‌లో జరుగుతున్న చర్చల వల్ల కూడా ప్రస్తుతం జరుగుతున్న తిరుగుబాటును ఆపలేకపోతున్నాయి. 


Also Read: Pakistan New CJI: పాకిస్థాన్ చరిత్రలో తొలి మహిళా సీజే... ప్రధాన న్యాయమూర్తిగా అయేషా మాలిక్ పేరు నామినేట్


భయంతో గడుపుతున్న ప్రజలు
తాలిబన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకోవడంతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. వేలాది మంది ప్రజలు ఎక్కువగా పార్కులు, బహిరంగ ప్రదేశాలలోనే గడుపుతున్నారు. ఆదివారం కాబూల్ ప్రశాంతంగా కనిపించినప్పటికీ, కొన్ని ఏటీఎంలు నగదు అంతా ఖాళీ అయిపోయింది. వందలాది మంది జనం బ్యాంకుల ముందు గుమిగూడారు. వారి సొమ్ము మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.


Also Read: UN Chief On Afghanistan: ఎంత బలప్రయోగం చేసినా తగ్గేదెలె.. అఫ్గాన్‌లో పరిస్థితులపై ఆ దేశాధ్యక్షుడి కీలక ప్రకటన..