Afghanistan Bomb Blast: అఫ్గానిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో గురువారం జరిగిన రెండు బాంబు దాడుల్లో 9 మంది మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు పేలుళ్లు జరిగాయి.
ఎవరి పని?
బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్‌లో రెండు మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని దుండగులు పేలుళ్లు జరిపారని అధికారులు తెలిపారు. ఈ బాంబు దాడులకు పాల్పడింది ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. తాలిబన్ బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి.
గత వారమే
అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. మసీదు, మతపరమైన పాఠశాలలో ఇటీవల జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారు. ఈ ఘటనలో మరో 43 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారు.
కుందుజ్ ప్రావిన్స్‌లోని ఇమామ్ సాహెబ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ బాంబు దాడి వెనుక ఐసిస్ పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంతకుముందు ఉత్తర మజర్-ఇ-షరీఫ్‌లోని మసీదుపై దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ బాంబు పేలుడులో 10 మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు.
తాలిబన్ల పాలన
అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణయాలు అఫ్గాన్‌ను మరింత దిగజారేలా చేస్తున్నాయి. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు.
ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబ్లను గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదన్నారు. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు.
20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ అఫ్గానిస్థాన్‌కు బైబై చెప్పి అమెరికా సైన్యం వెనుదిరిగింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే యూఎస్ దళాలు అఫ్గాన్‌ను వదిలి వెళ్లాయి. అప్గాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అమెరికా చేతులు దులుపుకొని వెళ్లిపోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందాయి.
Also Read: World’s Most Loyal Employee: 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో ఉద్యోగం- నీ ఓపికకు దండం సామీ!
Also Read: Coronavirus Cases: వరుసగా రెండో రోజు 3 వేల కరోనా కేసులు- 60 మంది మృతి