విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తేలా గడిచిన నాలుగు రోజుల్లో మూడు వివిధ ప్రదేశాల్లో ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. సౌత్ కొరియా, కెనడా, రష్యాలో ఘటనలతో మేల్కొని విమాన భద్రతకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


సౌత్ కొరియా ప్రమాదం:
సౌత్ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జేజూ ఎయిర్‌ ఫ్లైట్ 2216 ఘోర ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో, విమానం బెల్లీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. రన్‌వేపై జారిపడిన విమానం కాంక్రీట్ గోడను ఢీకొట్టి 179 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు సిబ్బందే బయటపడ్డారు. ఈ ప్రమాదం విమాన భద్రతా ప్రమాణాలను పునర్విమర్శించాల్సిన అవసరాన్ని స్పష్టంగా చాటుతోంది.


కెనడా ప్రమాదం:
కెనడాలోని హాలిఫాక్స్ స్టాన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. టెక్నికల్ లోపం కారణంగా ల్యాండింగ్ గేర్ పని చేయకపోవడంతో, విమానం రన్‌వేపై జారిపడింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


అజర్బైజాన్ ప్రమాదం:
డిసెంబర్ 25న ఖాజాకిస్తాన్ లోని అక్తావు నగరంలో అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 8432 క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించగా, 29 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా విమానం నియంత్రణ కోల్పోయి, అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
విమాన ప్రయాణంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, పైలట్స్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు వివిధ ల్యాండింగ్ ప్రక్రియలను చేపడతారు. విమానంలో సాంకేతిక లోపాలు, ఇంజిన్ సమస్యలు, లేదా వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రకమైన ల్యాండింగ్‌లు అవసరమవుతాయి.


అత్యవసర ల్యాండింగ్‌లు ఎన్ని రకాలు? 


ఫోర్స్డ్ ల్యాండింగ్ (Forced Landing):
ఈ ల్యాండింగ్‌ ప్రక్రియలో విమానం అత్యవసరంగా భూమికి దిగాల్సిన అవసరం ఏర్పడుతుంది. సాధారణంగా, ఇంజిన్లు పని చేయకపోవడం లేదా సాంకేతిక లోపాలు వస్తే, పైలట్స్ ఈ రకమైన ల్యాండింగ్‌ను చేపడతారు. అన్నీ అంశాలను పరిశీలించి, తక్కువ ఇంపాక్ట్ కలిగించే ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తారు.


ప్రికాషనరీ ల్యాండింగ్ (Precautionary Landing):


ఈ ల్యాండింగ్‌ ప్రక్రియలో భాగంగా, విమానంలో చిన్న సాంకేతిక సమస్యలున్నా, పైలట్స్ ముందు జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం రన్‌వే పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేపడతారు.


డిచింగ్ (Ditching):


ఈ ల్యాండింగ్ ప్రక్రియ సముద్రంలో లేదా నీటి ప్రాంతాలలో జరుగుతుంది. ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడితే, పైలట్స్ విమానాన్ని సురక్షితంగా నీటిలో దించే ప్రయత్నం చేస్తారు. ఈ రకమైన ల్యాండింగ్‌ చాలా అరుదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రక్రియ ను ఎంచుకుంటారు.


డెడ్‌స్టిక్ ల్యాండింగ్ (Deadstick Landing):


అన్ని ఇంజిన్ల పనితీరు పూర్తిగా ఫెయిల్ అయినప్పుడు, పైలట్ గ్లైడింగ్ విధానాన్ని ఉపయోగించి విమానాన్ని భూమి మీద దించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ల్యాండింగ్ పూర్తి గా 
పైలట్ నైపుణ్యం పై ఆధారపడుతుంది. 


బెల్లీ ల్యాండింగ్ (Belly Landing):
ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ లో, విమానంలోని ల్యాండింగ్ గేర్ ఫెయిల్యూర్ కారణంగా, విమానం ఫ్యూజలాజ్ (బెల్లీ) మీద భూమిని తాకుతుంది. ఇది సాధారణంగా ప్రమాదకరమైన ల్యాండింగ్ అయినప్పటికీ, పైలట్ రన్ వే ప్రణాళికలను అంచనా వేసి ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ప్రక్రియ లో విమానం నియంత్రణ కొల్పోయి రన్ వే ఓవర్ శూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. 


క్రాష్ ల్యాండింగ్ (Crash Landing):


అత్యవసర పరిస్థితుల్లో, విమానం పూర్తిగా కంట్రోల్ కోల్పోయినప్పుడు క్రాష్ ల్యాండింగ్ జరగవలసి ఉంటుంది. అయితే, పైలట్ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రమాద తీవ్రతను తగ్గించే విధంగా ఈ ల్యాండింగ్ ప్రక్రియను చేస్తారు.


ఫ్లేమ్ అవుట్ ల్యాండింగ్ (Flame Out Landing):


ఇంధనం సరిగా అందకపోవడం లేదా ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్ల, పైలట్ గ్లైడింగ్ టెక్నిక్ ఉపయోగించి భూమిపై ఈ అత్యవసర ల్యాండింగ్ చర్యను చేపడతారు. ఈ పరిస్థితిలో, పైలట్ సాధ్యమైనంత సురక్షితమైన ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తారు.


క్రాస్‌విండ్ ల్యాండింగ్ (Crosswind Landing):


ఈ ల్యాండింగ్ వాతావరణంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉండేటప్పుడు జరగుతుంది. ఇక్కడ, పైలట్ ల్యాండింగ్ ప్రక్రియను క్రాస్ విండ్ దిశతో సమన్వయం చేసుకొని, విమానాన్ని సురక్షితంగా రన్‌వే మీద దించే ప్రయత్నం చేస్తారు.


షార్ట్ ఫీల్డ్ ల్యాండింగ్ (Short Field Landing):


అత్యవసర పరిస్థితుల్లో ఈ రకమైన ల్యాండింగ్‌ను షార్ట్ రన్‌వేపై సాధ్యమైన స్థలాన్ని ఉపయోగించి జాగ్రత్తగా విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. పైలట్ చిన్న స్థలంలో హార్డ్ ల్యాండింగ్ పద్ధతిని ఉపయోగించి విమానాన్ని కంట్రోల్ చెయ్యాల్సి ఉంటుంది.


భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండటానికి ప్రయాణ భద్రత నియమాలను కఠినతరం చేయడం, అదే విధంగా విమానయాన రంగం గతంలో ఉన్న కొన్ని నిబంధనలను సవరించడం కూడా చాలా ముఖ్యం అని వారు అభిప్రాయపడుతున్నారు.