Ajay Banga Corona Positive:


ఢిల్లీలో రెండ్రోజుల పర్యటన..


దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం మొదలైంది. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఫ్లూ కూడా దాడి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, భారత సంతతికి చెందిన అజయ్ బంగా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయనకు కరోనా సోకినట్టు ఎంబసీ అధికారులు వెల్లడించారు. రొటీన్‌ టెస్టింగ్‌లో భాగంగా పరీక్ష చేయగా..కొవిడ్ సోకినట్టు నిర్ధరణ అయింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో అజయ్ బంగా సమావేశం అవ్వాల్సి ఉంది. ఆయనకు కరోనా సోకడం వల్ల ఈ భేటీని రద్దు చేశారు. ప్రస్తుతానికి బంగా క్వారంటైన్‌లో ఉన్నారని, సమావేశం అవడం కుదరడం లేదని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా గైడ్‌లైన్స్ ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపింది. భారత్‌కు వచ్చే ముందు టెస్ట్ చేయించుకున్నారు బంగా. అప్పుడు రిపోర్ట్‌లో నెగటివ్ వచ్చింది. ఆ తరవాతే భారత్‌కు వచ్చారు. ఇక్కడికి వచ్చాక టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది.