Work From Home Ends: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ 19 సమయంలో ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికి ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రీకాల్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీసీఎస్‌లో 20 శాతం మంది (6 లక్షల మంది ఉద్యోగులు) ఆఫీసుల నుంచి పని చేస్తున్నారు.
ఉద్యోగులు మాత్రం నో
టీసీఎస్‌లో వర్క్‌ఫోర్స్‌లో 70% మిలీనియల్స్ (1981-1996 మధ్యలో పుట్టిన వారు) ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో వీరంతా ప్రయాణ, నివాస ఖర్చులను ఆదా చేసుకునేందుకు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. వీరంతా తిరిగి ఆఫీసులకు వచ్చేందుకు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. హైబ్రిడ్ వర్క్ ప్లాన్‌ను 2025కి వాయిదా వేయడంపై కూడా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారట. మరోవైపు రిమోట్ వర్క్ అనేది అత్యవసర సమయంలో మాత్రమే ఏర్పాటు చేసిన విధానమని కంపెనీ వాదిస్తోంది.
25/25 మోడల్ వాయిదా
కరోనా సంక్షోభం వేళ టీసీఎస్ 25/25 మోడల్‌ను ప్రకటించింది. ఇంటి నుంచి పనిచేస్తున్నప్పటికీ బేస్ లోకేషన్‌కు రావాలని ఉద్యోగులకు సూచించింది. 25 by 25 దీర్ఘకాల విజన్‌లో భాగంగా 25 శాతం మందిని మాత్రం ఆఫీసులకు రమ్మంటోంది. ఆ తర్వాత హైబ్రీడ్ పని విధానాన్ని అమలు చేస్తామని పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగులు కొత్త మోడల్‌కు దశలవారీగా మారడానికి ముందు కార్యాలయానికి తిరిగి రావాలని అయితే కంపెనీ చెబుతోంది.
కష్టమే
ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రప్పించడం ఐటీ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత బతిమాలినా ఆఫీసులకు వచ్చేందుకు వారు ససేమిరా అంటున్నారు. ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు (Work From Home) మొగ్గు చూపుతున్నారు. ప్రతి నలుగురులో ముగ్గురు భారతీయ ఐటీ ఉద్యోగులు వారంలో కనీసం ఒక్కరోజైనా ఆఫీసుకు రావడం లేదని సీఐఈఎల్ హెచ్‌ఆర్ (CIEL HR) నిర్వహించిన సర్వేలో తేలింది. ఒకవేళ గట్టిగా ఆదేశాలు ఇద్దామంటే ఎక్కడ ఉద్యోగం మానేస్తారేమోనని కంపెనీలు భయపడుతున్నాయని తెలిసింది.
భారత్‌లోని టాప్-10 సహా 40 ఐటీ కంపెనీలను సీఐఈఎల్ సర్వే చేసింది. వీటిల్లో మొత్తం 9 లక్షల వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో చాలామంది ఇంటి నుంచి లేదా నచ్చిన చోటు నుంచే పనిచేస్తుండటంతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (Work From Office) పరివర్తన మరింత ఆలస్యం అవుతోందని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య మిశ్రా అంటున్నారు. ప్రస్తుతం సర్వే చేసిన కంపెనీల్లో 30 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో నడుస్తున్నాయి. మిగిలినవి కొంతవరకు ఆఫీసుల్లోనే నడుస్తున్నాయి. మరికొన్ని త్వరలో ఉద్యోగులను పిలిపిస్తున్నాయి. అయితే వారు మాత్రం ఆఫీసులకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.
Also Read: Maharaja Hari Singh: నిజాంకు ఓ న్యాయం- హరిసింగ్‌కు మరో న్యాయమా!
Also Read: Delhi Liquor Policy Case: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు