Jubilee Hills MLA: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ భీభత్సం చేశాడు. ఎమ్మెల్యే పీఏ విజయ్ సింహ పెళ్లైన ఓ మహిళ గొంతు కోశాడు. ఈ దాడిలో మహిళ గొంతు నుంచి ధారాళంగా రక్తం కారుతుండడంతో ఆమెను కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన విజయ్, న్యూడ్ కాల్స్ చేసి మహిళను వేధించడం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆదివారం రాత్రి మహిళ ఇంటికి వెళ్లి కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో మహిళ ఒప్పుకోలేదు. ఆవేశంతో ఊగిపోయిన పీఏ బీర్ బాటిల్‌తో మహిళపై దాడి చేశాడని సమాచారం.
బీరు బాటిల్‌తో మహిళపై దాడి చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు విజయ్ ఎమ్మెల్యే పీఏ కావడంతో పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోయారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా బాధిత మహిళ భర్త మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య మాట్లాడలేని స్థితిలో ఉందని అన్నారు. ఎమ్మెల్యే పీఏ విజయ్ సింహా తన భార్యతో తరచూ ఫోన్ లో మాట్లడేవాడని చెప్పారు. ఆమెతో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. ఆమెకు ఫోన్‌లో న్యూడ్ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ కూడా చేసేవాడని చెప్పారు. కాల్స్‌కు సంబంధించిన ఫోన్ రికార్డ్స్ అన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆమెతో తొలుత స్నేహంగానే ఉన్నాడని చెప్పారు. ఇలా ఏకంగా తమ ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చి దాడి చేస్తాడని అనుకోలేదని అన్నారు. ‘‘నిందితుడికి ఇతర రౌడీ షీటర్లు తెలుసు.. ఎమ్మెల్యే అనుచరుడు కూడా కావడంతో నాకు ఏమైనా సమస్యలు వస్తాయని భయంగా ఉంది’’ అంటూ బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశాడు.
నాకు విజయ్‌కు సంబంధం లేదు - ఎమ్మెల్యే గోపీనాథ్
ఈ విషయంపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను విలేకరులు వివరణ కోరగా విజయ్ తన పీఏ కాదని.. గతంలో ఓ కార్పొరేటర్ దగ్గర పని చేశాడని చెప్పారు.
స్పందించిన విజయ్
ఈ ఘటనపై విజయ్ కూడా స్పందించారు. మహిళపై హత్యాయత్నం జరిగిన సమయంలో తాను తన ఇంట్లో ఉన్నానని చెప్పారు. టీఆర్ఎస్ లో చురుగ్గా ఉంటున్నానని తనపై ఈ కుట్ర చేశారని ఆరోపించారు. గతంలో కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ దగ్గర పని చేశానని, బాబా ఫసియుద్దిన్ మోసాలు తెలిసి దూరంగా ఉన్నానని విజయ్ అన్నారు. గతంలో బాబా ఫసీయుద్దిన్ ఓ మహిళతో తనపై కేసు పెట్టించారని చెప్పారు. పోలీసుల విచారణలో అన్ని నిజాలు తేలతాయని అన్నారు. బాబా ఫసీయుద్దీన్ గురించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. బాధిత మహిళ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమని తెలియజేశారు. వారం రోజుల క్రితం బాధిత మహిళ భర్త తనను కలిశారని కూడా చెప్పారు. తనను ఏదైనా కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూరజ్ అనే వ్యక్తి చెప్పారని విజయ్ వెల్లడించారు.