పాద సేవనం
భగవంతుడి పాదాల్ని. గురువుల పాదాల్ని, సాధువుల పాదాల్ని సేవించడమే పాద సేవన భక్తి. ఇంకా ఆ భగవంతునికి నిర్మలమైన మనస్సుతో ప్రతీదీ ఆయన పాదాలకు సమర్పించడమే పాదసేవనం. నిరంతరం మన ధ్యాసను ఆయన పాదాల చెంత నిలిపితే చాలు అవి మనల్ని ఈ సంసారంలో నుంచి తేలికగా నడిపించి వేస్తాయి.
కీర్తనం
భగవంతుడి పాటలు పాడుతూ ఉంటే సహజంగా మన మనస్సు భగవంతుడి వైపు ఆకర్షితమవుతుంది. భగవత్సవంకీర్తనలో ప్రథమాచార్యుడిగా కీర్తి గాంచిన నారదుడు ఇందుకు ఉదాహరణ. భగవంతుని లీలలను పాడుతూ, ఆడుతూ మైమరచి... భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. మీరాబాయి, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని తెలుగునాట త్యాగయ్య, అన్నమయ్య వరకూ భగవంతుని వేనోట కీర్తించి తరించిన వారే.
శ్రవణం
భగవంతుని గురించి శ్రద్ధగా వినే ప్రతి మాటా, తెలియకుండానే మన మనసుని ప్రభావితం చేస్తుంది. అందుకే చాలా మంది సత్సంగం పేరుతో నలుగురూ ఒకచోటకి చేరి నాలుగు మంచి మాటలు చెప్పుకొనే అవకాశాన్ని వదులుకోరు.. తాను శాపవశాన మరో వారం రోజులలో చనిపోతానని తెలిసిన పరీక్షిత్తు మహారాజు, శుక మహర్షి ద్వారా భాగవతాన్ని వినాలనుకున్నాడు. ఈ విషయం గురించి భాగవతంలో చెప్పబడింది.
స్మరణం
స్మరిస్తే చాలు ఈ భవసాగరం నుంచి శాశ్వతంగా విముక్తిని ప్రసాదిస్తాడు అని విష్ణుసహస్ర నామాల్లో సహితం చెప్పబడింది. మనం దేనినైతే నిరంతరం తల్చుకుంటూ ఉంటామో.. దాన్ని తప్పక పొందగలం అని కొత్తగా వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా చెబుతున్నాయి. ఏ పనిచేస్తున్నా కూడా భగవంతుని మీదనే ధ్యాస ఉంచి నీవె దిక్కు అని ఉండడం అన్నమాట.
అర్చనం
ధూపదీప నైవేద్యాలతో, షోడశోపచారాలతో, పంచోపచారాలతో.. ఇవేవి కాకున్నా సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పినట్లుగా ‘పత్రం పుష్పం, ఫలం, తోయం(నీరు)‘ సమర్పిస్తే చాలు. ఎలాగైనా కానీ, వేటితోనైనా కానీ శ్రద్దగా పూజిస్తే చాలు ఆ భగవంతునికి మన భక్తిని అందించినట్లే. దీనికి ఉదాహరణ మధురానగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జని చెప్పవచ్చు
వందనం
మనసావాచాకర్మణా నిన్ను శరణం అంటున్నాను అనే భావనకు వందనం ఒక సూచన. వందనం అంటే అభివాదమే కాదు స్తుతించడం, కృతజ్ఞతలు తెలుపడం అన్న అర్థాలు కూడా ఉన్నాయి. భక్తి, శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించడం వందన భక్తి.
సఖ్యం
సఖుడు అంటే స్నేహితుడు. ఎలాంటి కష్టసుఖాల్లోనైనా తోడుండేవాడు స్నేహితుడు. భగవంతుడుని స్నేహితుడిగా తలుచుకుంటే ఆయన మనవాడే అన్న ఆత్మీయత ఏర్పడుతుంది. . నిరంతరం నా తోడుగా ఉంటాడన్న భరోసా ఉంటుంది. అందుకే సఖ్యం కూడా నవ విధ భక్తులలో ఒకటిగా ఎంచబడింది. దీనికి అర్జునుడు, కుచేలుడు మంచి ఉదాహరణ.
ఆత్మనివేదనం
మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తననుతాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి . నిరాకారుడు, నిరంజనుడు అయిన పరమాత్మకు సమానంగా మనం దేనిని నివేదించగలం. నశించిపోయే భౌతిక శరీరం కాకుండా, దేహానికి అతీతమైన ఆత్మ ఒక్కటే ఆ భగవంతునికి సరైన కానుక. ఆత్మ ఒక్కటే శాశ్వతం అని తెలుసుకొని, ఆ ఆత్మకు తుది గమ్యం పరమాత్మ అని గ్రహించి మసలుకోవడమే ఆత్మనివేదనం.
దాస్యం
సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి సేవ చేస్తూ అదే భావనతో జీవించడం. హనుమంతుడు ఎంతటివాడు? సాక్షాత్తూ చిరంజీవులలనే ఒకడు. కానీ మానవ రూపంలో ఉన్న రాముని కోసం ఏ పనికైనా సిద్ధపడ్డాడు. ఏ చిన్న పనిచేసినా సరే ఆ శ్రీరాముడికి తాను సేవ చేసే అవకాశం వచ్చిందన్న సంబరంలో చేశాడు.
ఇలా నవవిధ భక్తి మార్గాలలో ఏ ఒక్కదాన్ని మనం అనుసరించినా ఆ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగలం.