Woman Gives Birth on Bus: కేరళలో బస్‌లోనే ఓ మహిళ ప్రసవించింది. కొజికోడ్‌కి వెళ్తుండగా ఆమెకి ఒక్కసారిగా నొప్పులు వచ్చాయి. అప్పటికప్పుడు ఆపి హాస్పిటల్‌కి వెళ్లే వీలు కూడా లేకుండా పోయింది. కాసేపటికి ఆమెకి బస్‌లోనే ప్రసవం అయింది. పండంటి ఆడ శిశువు జన్మించింది. ఆమె బాధని గమనించిన బస్ డ్రైవర్‌ వెంటనే రూట్ మార్చి నేరుగా హాస్పిటల్‌కే తీసుకెళ్లాడు. అప్రమత్తమైన హాస్పిటల్ సిబ్బంది వెంటనే ఆమెని స్ట్రెచర్‌పై పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్లారు. KSRTC (కేరళ) బస్‌లో ఈ ఘటన జరిగినట్టు ANI న్యూస్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. నేరుగా హాస్పిటల్‌ ప్రాంగణంలోకి వచ్చిన బస్‌ లోపలికి మెడికల్ టీమ్‌ వెళ్లింది. హాస్పిటల్‌ లోపలికి తీసుకెళ్లే సమయం లేకపోవడం వల్ల బస్‌లోనే డెలివరీ చేశారు. ఆ తరవాత తల్లి బిడ్డలను లోపలికి తీసుకెళ్లారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 


"బస్‌ హాస్పిటల్‌కి వచ్చేటప్పటికే ఆమె పురిటి నొప్పులతో బాధ పడుతోంది. ఆ సమయంలో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌కి తరలించే అవకాశం లేదు. అందుకే బస్‌లోనే పురుడు పోయాల్సి వచ్చింది. తల్లిబిడ్డలు క్షేమంగా ఉండేలా చాలా జాగ్రత్తగా డెలివరీ చేశాం. ప్రస్తుతానికి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు"


- వైద్యుడు