Brazil Woman Brings Deadbody: లోన్‌ తీసుకునేందుకు బ్యాంక్‌కి వచ్చిన ఓ మహిళని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఆమె మామూలుగా లోన్ తీసుకుని ఉంటే ఏ సమస్యా ఉండకపోయేది. కానీ ఆ లోన్‌ కోసం వీల్‌ఛైర్‌లో ఓ డెడ్‌బాడీని పట్టుకొచ్చి ఆ శవంతోనే సంతకం పెట్టించింది. బ్రెజిల్‌లో జరిగిందీ షాకింగ్ సంఘటన. వృద్ధుడి సంతకం ఉంటే తప్ప లోన్‌ ఇవ్వరని, చనిపోయినా కూడా వీల్‌ఛైర్‌పై తీసుకొచ్చి బతికే ఉన్నాడని నమ్మించి లోన్‌ పేపర్స్‌పై సంతకం పెట్టించింది. బ్యాంక్‌కి తీసుకొచ్చే సమయానికే ఆ వృద్ధుడు చనిపోయి గంటలు గడిచిపోయాయి. ఆయనను అలానే వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి బ్యాంక్‌కి తీసుకొచ్చింది. ఆయన వరసకు తనకు అంకుల్ అవుతారని ఆయనకు లోన్ కావాలని బ్యాంక్ వాళ్లకి చెప్పింది. కౌంటర్ దగ్గరికి వీల్‌ఛైర్‌ని తీసుకెళ్లింది. ఆమే పెన్ పట్టుకుంది. ఆ వృద్ధుడి చేతిని ముందుకు తీసుకొచ్చింది. కానీ ఆయన స్పందించలేదు. "అంకుల్ నేను చెప్పేది మీకు వినబడుతోందా..? మీరు దీనిపై సంతకం పెట్టాలి" అని చెప్పింది.





ఇది గమనించిన బ్యాంక్ అధికారులు అప్పటికే ఆమెని అనుమానించారు. ఆయన తరపున తానే సంతకం పెడతాననీ చెప్పడం వల్ల ఆ అనుమానం ఇంకాస్త పెరిగింది. ఏమైందని అడిగితే ఆయన ఆరోగ్యం సరిగా లేదని సమాధానమిచ్చింది. అయితే...ఛైర్‌లో ఉన్న వృద్ధుడు పదేపదే వెనక్కి పడిపోతుండడాన్ని బ్యాంక్ సిబ్బంది గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆమె మోసం చేస్తోందని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆమె తరపున న్యాయవాది కోర్టులో గట్టిగానే వాదించాడు. బ్యాంక్‌లోనే ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పాడు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో మాత్రం ఆయన అంతకు ముందే చనిపోయాడని తేలింది. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.