12th Fail Release In China: గతేడాది అస్సలు అంచనాలు లేకుండా విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ సాధించిన సినిమాల్లో ‘12th Fail ’ కూడా ఒకటి. ఇంకా ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు చూస్తారా అని విమర్శించిన ప్రేక్షకులే.. మళ్లీ మళ్లీ ‘12th Fail ’ చూడడానికి ఇష్టపడ్డారు. ఇప్పటికీ పలు థియేటర్లలో ఇంకా ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఇప్పటికే హిందీలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు.. చైనాలో విడుదల కాగా.. ఇప్పుడు ‘12th Fail ’ కూడా ఆ లిస్ట్‌లోకి యాడ్ అవ్వనుంది. చైనాలో చాలా గ్రాండ్‌గా అత్యధిక స్క్రీన్‌లలో విడుదల అవ్వడానికి ‘12th Fail ’ సిద్ధమయ్యింది.
డిమాండ్ అలాంటిది..
చైనాలో దాదాపుగా 20 వేలకు పైగా స్క్రీన్స్‌లో ‘12th Fail ’ విడుదల కానుందని స్వయంగా ఈ మూవీ హీరో విక్రాంత్ మాస్సే ప్రకటించాడు. ‘‘గత కొన్ని నెలలుగా దీనిపై వర్క్ జరుగుతోంది. ఫైనల్‌గా విషయం బయటికొచ్చింది. అందరికీ ఈ సినిమా చైనాలో విడుదల అవుతుందని తెలిసిపోయింది. హిందీ సినిమా, ఇండియన్ సినిమాకు చైనాలో చాలా డిమాండ్ ఉంది. 12th Fail కు 20 వేలకు పైగా స్క్రీన్ లభించాయి. చైనాలో ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి బాగా గుర్తింపు ఉంది. అందుకే అన్ని స్క్రీన్స్ ఇచ్చారు’’ అని విక్రాంత్ మాస్సే చెప్పుకొచ్చాడు. ఇక ఇండియాలో వండర్స్ క్రియేట్ చేసిన ‘12th Fail ’.. చైనాలో కూడా క్రియేట్ చేస్తుందని ప్రేక్షకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
పుస్తకం ఆధారంగా..
‘12th Fail ’ సినిమా ప్రేక్షకులను మెప్పించడం మాత్రమే కాదు.. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా ఇంప్రెస్ చేసింది. కరీనా కపూర్, కంగనా రనౌత్, హృతిక్ రోషన్ వంటి నటీనటులు సైతం ఈ మూవీ గురించి సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీలో అద్భుతంగా నటించినందుకు విక్రాంత్ మాస్సేకు బెస్ట్ హీరోగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా దక్కింది. 2019లో రిలీజ్ అయిన ‘12th Fail ’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ శ్రద్ధా జోషి జీవిత కథల ఆధారంగా అనురాగ్ పాఠక్ ఈ పుస్తకాన్ని రాయగా.. విధు వినోద్ చోప్రా.. ఇదే పుస్తకాన్ని సినిమాలాగా తెరకెక్కించారు.
కేవలం మౌత్ టాక్‌తో..
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి, ఎక్కువగా ప్రమోషన్స్ లేకుండా కేవలం మౌత్ టాక్‌తోనే బ్లాక్‌బస్టర్ అయ్యింది ‘12th Fail ’. ఎన్నో ఏళ్లుగా హీరోగా ఒక గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న విక్రాంత్ మాస్సేకు ఏకంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇందులో విక్రాంత్ మాస్సేకు జోడీగా నటించిన మేధా శంకర్ పర్ఫార్మెన్స్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అనంత్ వీ జోషి, అన్షుమాన్ పుష్కర్, ప్రియాన్షు ఛాటర్జీ.. కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘12th Fail ’ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో కలెక్షన్స్ విషయంలో సెన్సేషన్ సృష్టించిన ఈ బయోపిక్.. చైనాలో ఏ రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.
Also Read: నేను రవి కిషన్ కూతురిని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి - ‘రేసు గుర్రం’ విలన్‌పై ఆరోపణలు