Gaami Director Vidyadhar Kagita: చాలా తక్కువ బడ్జెట్‌తో వండర్స్ క్రియేట్ చేయవచ్చని ఇప్పటికే పలు తెలుగు సినిమాలు నిరూపించాయి. అందులో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘గామి’ కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్, లిమిటెడ్ బడ్జెట్.. అయినా కూడా ఒక కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సాధించిన ‘గామి’.. తాజాగా ఓటీటీలో కూడా విడుదలయ్యి.. ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలయిన సందర్భంగా దర్శకుడు విద్యాధర్ కాగితా.. ‘గామి’కి లిమిటెడ్ బడ్జెట్ ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో బయటపెట్టాడు.


క్రియేటివ్ ట్రిక్..


‘గామి’లో క్లైమాక్స్‌కు వచ్చేసరికి శంకర్ (విశ్వక్ సేన్).. ఒక సింహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ తక్కువ ఉండడంతో ఆ సీన్‌ను ఎలా క్రియేట్ చేశారో బయటపెట్టాడు విద్యాధర్ కాగితా. ‘‘బడ్జెట్‌ను పొదుపు చేయడానికి వింతగా షూట్ చేసిన కొన్ని షాట్స్ ఉన్నాయి. ఉదాహరణకు శంకర్.. గుహలో ఇరుక్కుపోయిన తర్వాత చిన్న రంధ్రంలో నుండి చూస్తే సింహం తనవైపే చూస్తూ అరిచినట్టు ఉంటుంది. సింహానికి సంబంధించిన ప్రతీ షాట్‌కు మాకు చాలా ఖర్చు అయ్యింది. అందుకే సింహం నిజంగా అరిచిన ఒక ఫుటేజ్ తీసుకున్నాం. ఆ ఫుటేజ్‌ను ఒక లాప్‌టాప్‌లో ప్లే చేసి ఒక బాటిల్ క్యాప్‌కు చిన్న హోల్ పెట్టి.. అందులో నుండి షూట్ చేశాం. సినిమాలో మీరు చూసిన షాట్.. బాటిల్ క్యాప్‌లో నుండి లాప్‌టాప్‌ స్క్రీన్‌ను షూట్ చేసిందే’’ అంటూ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్.






కలిసి కష్టపడ్డాం..


‘గామి’లో వీఎఫ్ఎక్స్ విషయానికొస్తే.. ఎంత తక్కువ ఖర్చుతో కుదిరితే అంత తక్కువ ఖర్చుతో చేశామని విద్యాధర్ చెప్పుకొచ్చాడు. అనుకున్నది అనుకున్నట్టుగా చూపించడం కోసం తన టీమ్ అంతా కొన్ని రిస్కులు కూడా తీసుకున్నారని అన్నాడు. ‘‘డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో మాత్రమే షూట్ చేశాం. ఫోటోగ్రాఫిక్ లెన్స్ మాత్రమే వాడాము. లైటింగ్‌కు ఎక్కువగా పరికరాలు లేకపోవడంతో నేచురల్ లైటింగ్‌తోనే ఎక్కువగా షూట్ చేశాం. స్టోరీకి తగినట్టుగా ఈ షాట్స్ మాత్రమే మాకు కావాలి. అందుకే ఎక్స్‌ట్రా షాట్స్ తీయకూడదు అనుకున్నాం. అందుకే షూటింగ్ టైమ్ తగ్గింది. అందరం కలిసి కష్టపడినందుకే ఇది సాధించగలిగాం అనుకుంటున్నాను’’ అంటూ ‘గామి’ కోసం తాము పడిన కష్టాన్ని బయటపెట్టాడు.


కొత్త రోల్..


ఎక్కువగా కమర్షియల్, యూత్ ఫుల్ స్టోరీలనే ఎంచుకునే విశ్వక్ సేన్.. మొదటిసారి ‘గామి’లో అఘోరగా కనిపించాడు. అసలు ‘గామి’ ఎప్పుడు ప్రారంభమయ్యిందో, ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రేక్షకుడు ఊహించిన కొత్తదనం ఈ సినిమాలో ఉంది. ఇక ఇలాంటి ఒక కథను ఎంచుకున్నందుకు విశ్వక్ సేన్‌ను కూడా చాలామంది ప్రశంసించారు. మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న విద్యాధర్‌కు ఇంకా మంచి అవకాశాలు రావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జీ5లో ‘గామి’ స్ట్రీమింగ్ అవుతోంది.



Also Read: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం