Lok Sabha Election Exit Polls Results 2024: నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని ఆప్ నేత సోమ్‌నాథ్ భారతి తేల్చి చెప్పారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన ఈ ట్వీట్ చేశారు. I.N.D.I.A కూటమి విజయం సాధించి తీరుతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను కొట్టి పారేశారు. బ్యాలెట్‌ బాక్స్‌లు లెక్కించిన తరవాత ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అవుతాయని స్పష్టం చేశారు. న్యూ ఢిల్లీ లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమ్‌నాథ్ భారతి చేసిన ట్వీట్‌ వైరల్ అవుతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని తాము నిరూపించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 


"ఒకవేళ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే నేను గుండు కొట్టించుకుంటా. ఈ మాటను బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడొచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ తప్పు అని జూన్ 4వ తేదీన రుజువవుతుంది. నరేంద్ర మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోసారి ప్రధాని అయ్యే ఛాన్స్ లేదు. ఢిల్లీలో 7 స్థానాల్లోనూ కూటమిదే విజయం. మోదీకి భయపడి కొందరు ఇలా ఎగ్జిట్ పోల్ అంచనాలను బీజేపీకి అనుకూలంగా ఇచ్చారు. అసలు ఫలితాలు వచ్చేంత వరకూ ఎదురు చూడాలి. బీజేపీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఓట్లు పోల్ అయ్యాయని నమ్ముతున్నా"


- సోమ్‌నాథ్ భారతి, ఆప్‌ నేత 


 






ABP Cvoter Exit Poll 2024 అంచనాలివే..


ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌ 2024 అంచనాలు NDA (ABP CVoter Exit Poll 2024 Results) హ్యాట్రిక్ కొడుతుందనే చెప్పాయి. 400 సీట్ల లక్ష్యానికి చేరువలో ఉంటుందని తెలిపింది. గరిష్ఠంగా 396 సీట్లు వస్తాయని తెలిపింది. అంటు ఇండీ కూటమికి గరిష్ఠంగా 167 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల తరవాత బీజేపీలో జోష్ పెరిగింది. అప్పుడే మోదీ 100 రోజుల ప్లాన్‌ సిద్ధం చేసుకుంటున్నారు. అధికారంలోకి రాగానే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా ఎగ్జిట్ పోల్స్ కూడా NDA హ్యాట్రిక్ పక్కా అని తేల్చి చెప్పాయి. అయితే...I.N.D.I.A కూటమి మాత్రం ఈ అంచనాలను బోగస్ అని కొట్టి పారేస్తోంది. కచ్చితంగా తమకు 295 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది. 


Also Read: Election Results 2024: ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టిన బీజేపీ,అరుణాచల్ ప్రదేశ్‌లో ఘన విజయం