United States won by 7 wkts against Canada in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్(T20 World Cup) తొలి మ్యాచ్ లో సిరీస్ కు సహఆతిథ్యం ఇస్తున్న అమెరికా(USA) జట్టు ఘన విజయం సాధించింది. గ్రూప్ -Aలో డాలస్ వేదికగా కెనడా(Canada)తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో మరో 14 బంతులు మిగిలి ఉండగానే యూఎస్ ఏ జట్టు జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు నవ్ నీత్ ధలీవాల్ 61, నికోలస్ కిర్టన్ 51 పరుగుల సాయంతో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. శ్రేయాస్ మొవ్వ 32, అరోన్ జాన్సన్ 23 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. 195 పరుగుల లక్ష్యాన్ని అమెరికా జట్టు 14 బంతులు మిగిలి ఉండగానే అవలీలగా చేధించింది. అమెరికా ఆటగాడు అరోన్ జోన్స్ 40బంతుల్లో 94పరుగులతో నాటౌట్ గా నిలిచి.. జట్టుకు విజయాన్ని అందించాడు. ఆండ్రీస్ గోస్ 65 పరుగులతో జోన్స్ కు పూర్తి సహకారం అందించాడు. అరోన్ జోన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


 

భారీ స్కోరు చేసినా...

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అమెరికా... కెనడాను బ్యాటింగ్‌కు అహ్వానించింది. టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెనడాకు ఓపెనర్లు నవనీత్ ధలీవాల్- ఆరోన్ జాన్సన్ జోడి మంచి ఆరంభం అందించింది. కేవలం ఐదు ఓవర్లలో 43 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. అయితే ముంబైలో జన్మించిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్ హర్మీత్ సింగ్ ఆరో ఓవర్లో జాన్సన్‌ను అవుట్ చేసి కెనడాను తొలి దెబ్బ తీశాడు. భారత సంతతికి చెందిన మరో కెనడా ఆటగాడు పర్గత్ సింగ్ కూడా ఎనిమిదో ఓవర్‌లో రనౌట్ కావడంతో కెనడా కష్టాల్లో పడింది. అయితే ధలివాల్‌తో జత కలిసిన నికోలస్ కిర్టన్‌ కెనడాను మంచి స్కోరు దిశగా నడిపించాడు. కిర్టన్‌తో కలిసి ధలీవాల్‌ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

నవనీత్‌ దలీవాల్‌ 44 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. నికోలస్‌ కిర్టన్‌ కూడా 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. 15వ ఓవర్‌లో ధలీవాల్-కిర్టన్ మధ్య భాగస్వామ్యానికి తెరపడింది. కీపర్ శ్రేయాస్ మొవ్వా కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేయడంతో కెనడా మంచి స్కోరు చేసింది. కెనడా జట్టు నవ్ నీత్ ధలీవాల్ 61, నికోలస్ కిర్టన్ 51 పరుగుల సాయంతో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

 

జోన్స్‌ ధనాధన్‌

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా మరో 14 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తొలి ఓవర్‌లో రెండో బంతికే వికెట్‌ కోల్పోయిన అమెరికా లక్ష్యం దిశగా పయనిస్తుందా అన్న సందేహాలు వచ్చాయి. కానీ అమెరికా బ్యాటర్‌ అరోన్‌ జోన్స్‌... కెనడాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అరోన్ జోన్స్, ఆండ్రీస్ గోస్ అమెరికాకు పొట్టి ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందించారు. ఆరోన్ జోన్స్ 40 బంతుల్లో 4 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 94 పరుగులతో కెనడాపై అమెరికాకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఆండ్రీస్ గౌస్ కూడా 46 బంతుల్లో 65 పరుగులతోరాణించాడు.   జోన్స్, గౌస్ మూడో వికెట్‌కు 131 పరుగుల విలుపైన భాగస్వామ్యంతో అమెరికాకు సొంత గడ్డపై చక్కటి విజయాన్ని అందించారు.