Dinesh Karthik Retirement News:

  భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు, వన్డే, టీ20 అన్ని క్రికెట్ ఫార్మాట్లకు శనివారం నాడు (జూన్ 1న) రిటైర్మెంట్ ప్రకటించాడు. తన పుట్టినరోజు సందర్భంగా దినేష్ కార్తీక్ కెరీర్‌లో కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. తన పుట్టినరోజు నాడే అభిమానులకు డీకే బిగ్ షాకిచ్చాడు. తనకు ఇప్పటివరకూ మద్దుతు తెలిపిన వారికి, అండగా నిలిచిన వారికి, అవకాశం ఇచ్చిన తమిళనాడు క్రికెట్ బోర్డుతో పాటు బీసీసీఐకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశాడు.


అదే కార్తీక్ చివరి మ్యాచ్ 
ఇటీవల ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ దినేష్ కార్తీక్ చివరి మ్యాచ్. ఆ మ్యాచ్ లో RCB ఓడిపోగా, దినేష్ కార్తీక్‌ రిటైర్మెంట్ ప్రకటించేశాడని ప్రచారం జరిగింది. ఆర్సీబీ టీమ్ సైతం గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి డీకే గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ దినేష్ కార్తీక్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఓ ప్రకటన చేశాడు. 


 






గత కొద్ది రోజులుగా మీరు నాపై చూపించిన ఆప్యాయత, ఆదరణ, ప్రేమకు పాత్రుడ్ని. నాకు మద్దతు తెలిపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. కొన్నిరోజులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నాను. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. క్రికెట్‌లో నా ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సక్సెస్‌గా మార్చిన అందరు కోచ్‌లు, కెప్టెన్‌లు, సెలెక్టర్లు, తోటి క్రికెటర్లు, సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. 


‘క్రికెట్ ఆడే వారిలో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే వారిలో ఒకడ్ని అయినందుకు అదృష్టవంతుడ్ని. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాను. తల్లిదండ్రులు ఇచ్చి బలం, మద్దతుతో నిలదొక్కుకున్నాను. వారి ఆశీర్వాదంతో ఇలా ఎదిగాను. నా భార్య దీపికకు చాలా రుణపడి ఉన్నాను. నా కోసం తన కెరీర్‌ను వదులుకుంది. కెరీర్ మొత్తం సహకరిచిన అందరికీ ధన్యవాదాలు’ తెలుపుతూ కార్తీక్ ఓ పోస్ట్ చేశాడు.


ధోనీ కన్నా ముందే అరంగేట్రం
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కంటే ముందు దినేష్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు. టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కార్తీక్ నవంబర్ 2004లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 5 సెప్టెంబర్ 2004న ఇంగ్లాండ్‌పై వన్డేల్లో, 1 డిసెంబర్ 2006న టీ20 క్రికెట్‌లో భారత్‌కు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించాడు. 


ఎంఎస్ ధోనీ డిసెంబర్ 2005లో శ్రీలంకపై టెస్టుల్లో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 2004 డిసెంబర్‌లో ధోనీ వన్డేల్లో, టీ20ల్లో ధోనీ, దినేష్ కార్తీక్ ఒకే మ్యాచ్‌లో అరంగేట్రం చేశారు. 300 టీ20 మ్యాచ్‌లు ఆడిన 4వ భారత బ్యాటర్‌గా కార్తీక్ నిలిచాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచ కప్‌తో పాటు 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గి భారత జట్టులో సభ్యుడిగా కార్తీక్ ఉన్నాడు. 


డీకే కెరీర్ గణాంకాలు
దినేష్ కార్తీక్ 26 టెస్టుల్లో 1025 రన్స్ చేశాడు. 57 క్యాచ్‌లు, 6 స్టంపింగ్‌లు చేసి వికెట్లలో పాలు పంచుకున్నాడు. 94 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ 9 హాఫ్ సెంచరీల సాయంతో 1752 పరుగులు సాధించాడు. 64 క్యాచ్‌లు పట్టిన ఈ కీపర్ 7 స్టంపింగ్స్ చేశాడు. 56 టీ20 మ్యాచ్‌లాడిన కార్తీక్ 29 సగటుతో 672 రన్స్ చేశాడు. టీ20లలో 387 క్యాచ్‌లు అందుకున్న డీకే 45 మంది బ్యాటర్లను స్టంప్ ఔటయ్యాడు.