T20 World Cup 2024 Team India Schedule:  వన్డే ప్రపంచకప్‌లో తుది సమరంలో బోల్తాపడిన టీమిండియా(Team India) టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో సత్తా చాటాలని చూస్తోంది. రోహిత్‌ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీ(Virat kohli) సహా మరికొందరు ఆటగాళ్లకు ఇదే చివరి ప్రపంచకప్‌ అని భావిస్తున్న దేశంలోని క్రికెట్‌ అభిమానుల దృష్టంతా ఈ పొట్టి ప్రపంచకప్‌ మీదే ఉంది. కానీ వెస్టిండీస్‌-అమెరికా(US and the Caribbean) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్‌ మ్యాచ్‌ ఆడే సమయంపై అభిమానుల్లో ఆరంభంలో ఆందోళన కనిపించింది. కానీ చాకచక్యంగా వ్యవహరించిన బీసీసీఐ(BCCI)... రాత్రి సమయాల్లో భారత అభిమానులు చూడగలిగే  సమయంలోనే మ్యాచ్‌లను వీక్షించేలా సమయాల్లో మార్పులు చేసింది. వేరే జట్ల మ్యాచులు ఏ అర్థరాత్రో జరిగితే... భారత్‌ ఆడే మ్యాచ్‌లు మాత్రం సరిగ్గా మన దగ్గర ఐపీఎల్‌ మ్యాచులు చూసే సమయంలోనే జరగనున్నాయి. రాత్రి ఎనిమిది గంటల సమయంలోనే భారత్‌ ఆడే టీ 20 ప్రపంచకప్‌ మ్యాచులు జరిగేలా బీసీసీఐ షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ నిర్ణయంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

 

చూడకపోతే కష్టం..నష్టం

భారత్‌లో క్రికెట్‌ ఓ మతమైతే... క్రికెటర్ల దేవుళ్లు. ప్రపంచంలోని ఏ దేశంలో లేనంతగా దేశంలో క్రికెట్‌కు అభిమానులు ఉన్నారు. కోహ్లీ ఆడుతుంటే చూడాలని.. రోహిత్‌ శర్మ సిక్సర్లను బాదేస్తుంటే చూసేందుకు అభిమానులు కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు. మాములు టోర్నీల్లోనూ ఇలా ఎదురుచూస్తే మరి టీ 20 ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్‌ల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఈసారి టీ 20 ప్రపంచ కప్‌ మ్యాచులకు అమెరికా-వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇస్తుండడంతో భారత్‌ మ్యాచులు చూడాలంటే అర్థరాత్రి వరకూ నిద్ర మానుకుని ఎదురుచూడాలని అభిమానులు అనుకున్నారు. నిజానికైతే భారత్‌ మ్యాచులు కూడా ఏ అర్థరాత్రో... తెల్లవారుజామునో జరగాలి. కానీ ఇక్కడే బీసీసీఐ చక్రం తిప్పింది.  దీనికి సరైన కారణాలు ఉండడంతో ఐసీసీ అంగీకరించింది. ఐసీసీకి అన్ని దేశాల బోర్డులతో పోలిస్తే భారత్‌ నుంచే ఎక్కువ నిధులు సమకూరుతాయి. భారత్‌ మ్యాచ్‌ ఆడుతుందంటే చాలు స్టేడియాలతోపాటు టీవీల్లో వీక్షించే వారి సంఖ్య కోట్లు దాటుతుంది. ఒకవేళ మ్యాచ్‌లు అర్థరాత్రి నిర్వహిస్తే మ్యాచ్‌లను వీక్షించే భారతీయుల సంఖ్య భారీగా పడిపోతుంది. అప్పుడు ఐసీసీకి భారీగా నష్టం వస్తుంది. అందుకనే టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ ఆడే మ్యాచ్‌లన్నీ ఎనిమిది గంటలకే నిర్వహించేలా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భారత్‌ ఆడే టీ 20 ప్రపంచకప్‌ మ్యాచులు అన్నీ రాత్రి ఎనిమిది గంటల సమయంలోనే జరగనున్నాయి. భారత్‌ సెమీస్‌కు చేరితే ఆ మ్యాచులు కూడా రాత్రి ఎనిమిది గంటలకే ప్రారంభం అవుతాయి. భారత్‌ ఫైనల్‌ చేరితే ఆ మ్యాచ్‌ కూడా రాత్రి ఎనిమిది గంటలకే ఆరంభం అవుతుంది. 

 

భారత్ టీ20 ప్రపంచకప్ షెడ్యూల్:

జూన్ 5: భారత్ vs ఐర్లాండ్ 

 ఎక్కడంటే: నస్సావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ - రాత్రి 8:00 గంటలకు మ్యాచ్‌ ఆరంభం

 

జూన్ 9: భారత్ vs పాకిస్థాన్

ఎక్కడంటే: నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ - రాత్రి 8:00 గంటలకు

 

జూన్ 12: ఇండియా vs అమెరికా

ఎక్కడంటే : నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్ - రాత్రి 8:00 గంటలకు 

 

జూన్ 15: ఇండియా vs కెనడా 

ఎక్కడంటే : సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ & బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా రాత్రి 8:00 గంటలకు