Foreign Universities in India:


ఫండింగ్స్‌ కీలకం..


ఫారిన్ యూనివర్సిటీలు భారత్‌కు వచ్చేస్తాయని కేంద్రం తీపి కబురు అందించింది. ఆక్స్‌ఫర్డ్ లాంటి యూనివర్సిటీలు ఇక్కడ క్యాంపస్‌లు పెట్టుకునేందుకు లైన్ క్లియర్ చేస్తున్నట్టూ వెల్లడించింది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా...విద్యను అంతర్జాతీయం చేస్తామని మోడీ సర్కార్ హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇది చాలా మంచి విషయమే అయినా....సాధ్యపడుతుందా లేదా అన్న విషయమూ చర్చించుకోవాలి. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే...మొట్టమొదటగా చర్చకు వస్తున్న అంశం..."నిధుల సమీకరణ". సాధారంగా...విదేశీ యూనివర్సిటీలకు స్థానిక ప్రభుత్వాలు,బడా బడా కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు పెద్ద ఎత్తున ఫండ్స్ ఇస్తారు. అందుకే ఆ స్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు అందించగలుగుతున్నాయి. స్థానికంగా ఓ బ్రాండ్‌గా ఎదుగుతున్నాయి. అయితే...భారత్‌లో అవే యూనివర్సిటీలకు ఆ స్థాయిలో ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయా..? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. స్టేక్‌హోల్టర్స్‌ కూడా యూనివర్సిటీలకు ఆ స్థాయిలో ఫండింగ్ ఇస్తారా అన్నదీ అనుమానమే అంటున్నారు విశ్లేషకులు. ఇది మొదటి అడ్డంకిగా మారే అవకాశముంది. ఇదే సమయంలో ఖతార్‌ గురించి చర్చించుకోవాలి.


ఖతార్‌లో యూనివర్సిటీలు..


Qatar Foundation సంస్థ 1995లో ప్రారంభమైంది. ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే అప్పట్లో  దీన్ని స్థాపించారు. ఈ సంస్థకు పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదొక్కటే కాదు. ఖతార్ ప్రభుత్వం విదేశీ యూనివర్సిటీలకు భారీ ఎత్తున నిధులు అందిస్తుంది. ఇప్పుడా దేశంలో వర్జీనియా కామన్‌వెల్త్ యూనివర్సిటీ, టెక్సాస్ A&M యూనివర్సిటీ, జార్జ్ టౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫారిన్ సర్వీస్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ లాంటి పెద్ద పెద్ద వర్సిటీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిటీగా పిలుచుకునే దోహాలో ఈ అన్ని యూనివర్సిటీలకు భారీ క్యాంపస్‌లు ఉన్నాయి. ఇక న్యూయార్క్ యూనివర్సిటీకి కూడా ప్రపంచవ్యాప్తంగా క్యాంపస్‌లు ఉన్నాయి. 2007లో అబుదాబిలో ఈ వర్సిటీ ఏర్పాటు చేశారు. యూఏఈ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే నిధులు అందిస్తోంది కూడా. చైనాలోని షాంఘైలోనూ న్యూయార్క్ యూనివర్సిటీ అందుబాటులో ఉంది. సింగపూర్‌లో యేల్ యూనివర్సిటీని నెలకొల్పారు. సింగపూర్ ప్రభుత్వం కూడా యూనివర్సిటీలకు భారీగా నిధులు అందిస్తూ ఉంటుంది. 


కేంద్రం పూచీకత్తు ఇస్తుందా..? 


ఇవన్నీ దాదాపు అమెరికాకు చెందిన యూనివర్సిటీలే. లోకల్ అథారిటీస్‌ మద్దతు లేకుండా అవి ఎక్కువ కాలం పాటు కొనసాగలేవు. భారత్‌లో ఇది సాధ్యమా  అన్నది చర్చించాలంటే...గతంలో కొందరు నిపుణులు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. విద్యారంగంలో అతి పెద్ద సంస్థగా భావించే  Central Square Foundation వ్యవస్థాపకులు ఆశిష్ ధావన్‌ రెండేళ్ల క్రితమే దీనిపై తన అభిప్రాయం పంచుకున్నారు. "విదేశీ వర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసే అవకాశాలు చాలా తక్కువ. మధ్యప్రాశ్చ్యంలోని ధనిక దేశాలు మాత్రమే అలాంటి యూనివ ర్సిటీల నిర్వహణను కొనసాగించగలిగాయి. అంతే కాదు. ఆయా దేశాలు నిధులు అందిస్తామని పూచీకత్తు ఇచ్చాయి. అందుకే అంత ధైర్యంగా ఆయా వర్సిటీలు క్యాంపస్‌లు ఏర్పాటు చేశాయి. భారత ప్రభుత్వం ఆ పూచీకత్తు ఇచ్చేందుకు అంగీకరించకపోవచ్చు" అని అన్నారు. నిజానికి  పలు యూనివర్సిటీలు ఇప్పటికే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. పలు చోట్ల ప్రభుత్వాలు బడ్జెట్‌లో కోత విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిధుల గురించి ఆలోచించకుండా భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తాయా అన్న అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు పలువురు నిపుణులు. ఒక్కసారి క్యాంపస్‌ ఏర్పాటయ్యాక...బ్రాండ్‌కు తగ్గట్టుగానే మెయింటేన్ చేయాలని చూస్తాయి ఆయా వర్సిటీలు. స్థానిక ప్రభుత్వాల నుంచి సపోర్ట్‌ ఆశిస్తాయి. ఇది అన్ని చోట్లా అందితేనే ఎక్కువ కాలం పాటు మనగలుగుతాయి. అయితే...ఇది సాధ్యం కాదు అని కచ్చితంగా చెప్పలేం కూడా. మోడీ సర్కార్ ఎలాంటి వ్యూహాలతో సంప్రదింపులు జరుపుతోంది అన్నది తెలియాల్సి ఉంది. ఏదో ఓ విషయంలో ఆయా వర్సిటీలకు భరోసా ఇవ్వగలిగితే "నిపుణుల హబ్‌" అయిన భారత్‌కు రావడానికి ఆయా వర్సిటీలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. 


Also Read: Modi on Foreign Universities: త్వరలోనే భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్! మోడీ సర్కార్ ముందడుగు