Flag Hoisting:


5 దశాబ్దాలుగా పతాకాన్ని ఎగరేయని ఆర్‌ఎస్‌ఎస్


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా హర్‌ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 13-15వ తేదీ వరకూ దేశ వాసులందరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరేయాలని సూచించారు. సోషల్ మీడియాలోనూ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని చెప్పారు. ఈ పిలుపు మేరకు కొంత మంది జాతీయ జెండాను డీపీగా పెట్టుకున్నారు. అటు కాంగ్రెస్ కూడా నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఫోటోను డీపీగా పెట్టుకుంది. అప్పటి నుంచి భాజపాపై విమర్శలు చేస్తూనే ఉంది. పాలిస్టర్‌తో తయారు చేసిన జాతీయ జెండాలను విక్రయించేందుకు కేంద్రం అనుమతినివ్వటంపై మండి పడింది. ఈ క్రమంలోనే RSSపైనా విమర్శలు ఎక్కుపెట్టింది.  "మేమంతా త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకున్నాం. కానీ ప్రధాని మోదీ పిలుపు, ఆయన కుటుంబ సభ్యులకే వినపడలేదేమో. నాగ్‌పూర్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో 52 ఏళ్లుగా జాతీయ జెండా ఎగరేయని వాళ్లు, ప్రధాని మాటలు వింటారా..?" అని ట్వీట్ చేసింది కాంగ్రెస్. సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా... RSS ట్విటర్ అకౌంట్ డీపీల స్క్రీన్‌షాట్స్‌ తీసి ట్వీట్ చేశారు. RSS చీఫ్ మోహన్ భగవత్ ట్విటర్ అకౌంట్‌ డీపీ కూడా ఇందులో ఉంది. ఇంతకీ RSS ఇన్నేళ్లుగా..ఎందుకు జాతీయ జెండాను ఎగరేయటం లేదు..?





 


ఆ నిబంధనలే కారణమా..? 


ప్రతి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను ఎగరేస్తుంది. ఈ సంస్థ మొదటి సారి 1947 ఆగస్టు 15వ తేదీన నాగ్‌పూర్‌లోని హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ జెండా ఎగరేసింది. ఆ తరవాత 1950 జనవరి 26వ తేదీన జెండాకు గౌరవ వందనం సమర్పించింది. అప్పటి నుంచి దాదాపు 5 దశాబ్దాల వరకూ జెండా ఎగరేయలేదు. 2022లో జనవరి 26వ తేదీన చివరిసారి జాతీయ జెండా ఎగరేసింది RSS. ఎందుకిలా అన్నదే ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వస్తున్న చర్చ. అయితే దీనికి RSSసభ్యులు వివరణ ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు జాతీయ జెండాను ఎగరేయకూడదు అని 2002లో రూపొందించిన ఫ్లాగ్‌ కోడ్‌లో (India's Flag Code)ని నిబంధనను ప్రస్తావిస్తున్నారు. "Flag Code of India 2002"లో కొన్ని కీలక నిబంధనలు చేర్చారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించటానికి, ఎగరేయటానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సూచనల ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పింది. ప్రైవేట్, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలు త్రివర్ణ పతాకాన్ని ఎలా ప్రదర్శించాలనే అంశంపై ఇందులో స్పష్టమైన సూచనలు చేశారు. ఈ నిబంధనలు పాటిస్తున్నందునే జాతీయ జెండాను ప్రదర్శించటం లేదని చెబుతోంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సంస్థ. ఎప్పటి నుంచో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. 


అప్పట్లో భగవత్ ఏమన్నారంటే..


2018లో దిల్లీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న RSS చీఫ్ మోహన్ భగవత్...ఈ వివాదంపై స్పందించారు. "జాతీయ జెండా పుట్టుక దగ్గర నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ఉంది. ఆ పతాకానికున్న గౌరవమేంటో మాకు తెలుసు" అని స్పష్టం చేశారు. అయితే అంతకు ముందు 2015లో చెన్నైలోని ఓ సెమినార్‌లో ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు భగవత్. "జాతీయ జెండాలో కాషాయ రంగు మాత్రమే ఉండాలి. మిగతా రెండు రంగులూ మతంతో ముడి పడి ఉన్నాయి" అని అన్నారు. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియా డీపీ మార్చుకోవాలన్న పిలుపుతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. 


Also Read: Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?


Also Read: Copy Cat: కాపీక్యాట్ అని ఎందుకు అంటారు? ఈ పదం ఎప్పుడు పుట్టింది?