PM Modi Meditation: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఆ రోజు కోసం దేశమంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఫలితాలపై తనకు ఎలాంటి ఆందోళన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ రోజు అసలు టీవీ చూడనని, ఫోన్ కూడా చెక్ చేయనని తెలిపారు. మరి ఆ రోజు ఏం చేస్తారు అని అడిగితే రోజంతా ధ్యానం చేసుకుంటానని ఆసక్తికర సమాధానమిచ్చారు. దాదాపు 48 గంటల పాటు ధ్యానంలో ఉంటారు మోదీ. తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్‌లో (Vivekananda Rock Memorial) ధ్యానం చేయనున్నారు. అందులో ప్రత్యేకంగా ధ్యాన మండపం ఉంది. ఇదే చోట 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ధ్యానం చేసుకోడానికి మోదీ ఇక్కడికే ఎందుకు వస్తున్నారన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇక్కడే ఎందుకు..?
ప్రధాని నరేంద్ర మోదీ చాలా సందర్భాల్లో స్వామి వివేకానందుడి (Vivekananda Rock Memorial Significance) గురించి ప్రస్తావించారు. ఆయన సిద్ధాంతాలే తమను ముందుకు నడిపిస్తున్నాయని వెల్లడించారు. ఇక చరిత్రలోకి వెళ్తే...కన్యాకుమారిలోని వావవతురై బీచ్‌కి 500 మీటర్ల దూరంలో ఉందీ రాక్ మెమోరియల్. హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే ఈ చోట దీన్ని నిర్మించారు. 1892లో ఈ ప్రాంతంలోనే స్వామి వివేకానంద ఓ రాయిపై ధ్యానం చేసుకున్నారు. మూడు రోజులు, మూడు రాత్రుల పాటు ఇక్కడే ధ్యానంలో ఉన్నారు. ఇక్కడ ధ్యానం చేసుకున్న తరవాత (Vivekananda Rock Memorial History) ఆయనకు జ్ఞానోదయం అయిందని చెబుతారు. ఆయన తన సిద్ధాంతాలకు తుది రూపు తీసుకొచ్చింది కూడా ఇక్కడే. ఈ ప్రాంతం గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో 1963లో RSS కార్యకర్త ఏక్‌నాథ్ రనాదే వివేకానంద రాక్ మెమోరియల్ (Swami Vivekananda) నిర్మించాలని ప్రతిపాదించారు. 1970 నాటికి ఆ నిర్మాణం పూర్తైంది. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే ప్రధాని మోదీ ఇక్కడే ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు. వివేకానందుడిని రోల్‌మోడల్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోదీ రామకృష్ణ మిషన్‌లో సభ్యులు కూడా.
రాజకీయ కోణం..?
పొలిటికల్‌గా చూసుకున్నా దక్షిణాదిపై ప్రధాని ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారన్న సంకేతాలివ్వడానికీ ఈ ప్లేస్‌ని ఎంపిక చేసుకుని ఉంటారన్నది మరో వాదన. దాదాపు మూడేళ్లుగా సౌత్‌పై మునుపటి కన్నా ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాదిలోనే తమిళనాడులో దాదాపు 7 సార్లు పర్యటించారు. అసలు బీజేపీకి ఉనికే లేని చోట పదేపదే మోదీ పర్యటించడం ద్వారా తన ప్రాధాన్యతలేమిటో పరోక్షంగా వివరిస్తున్నారు మోదీ. మొత్తం 543 స్థానాలున్న లోక్‌సభలో 131 సీట్లు దక్షిణాది రాష్ట్రాలవే. ఒక్క తమిళనాడులోనే అత్యధికంగా 39 ఎంపీ సీట్లున్నాయి. సౌత్‌లోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగి తీరతామని ప్రధాని మోదీ ఇప్పటికే జోస్యం చెప్పారు. గతంతో పోల్చి చూస్తే పార్టీ చాలా పుంజుకుందని, ఈసారి రికార్డు స్థాయిలో నంబర్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ ధ్యానం చేసే చోట దాదాపు 2 వేల మంది పోలీసులు ఆయనకు భద్రత కల్పించనున్నారు.
Also Read: Delhi: ఎండ వేడి తట్టుకోలేక పేలిపోయిన ఏసీ, ఫ్లాట్‌లో మంటలు - వైరల్ వీడియో