New York increases security ahead of India vs Pakistan Match: భారత్‌-పాకిస్తాన్(India Vs Pakistan) మ్యాచ్ అంటేనే అభిమానులకు పండగ. ఇరు జట్ల మధ్య
మ్యాచ్‌లో ఆట కంటే భావోద్వేగాలకే అభిమానులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అదే ప్రపంచకప్‌(World Cup2024) అయితే ఆ మ్యాచ్‌కు ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అందరి దృష్టి జూన్‌ 9న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య న్యూయార్క్‌(New York)లో జరిగే మ్యాచ్‌ మీదే ఉంది. అయితే భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు భద్రతాపరమైన ముప్పు ఉందనే అంచనాలతో న్యూయార్క్‌లో భద్రతను భారీగా పెంచారు.


న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్‌ పార్క్ స్టేడియం(Eisenhower Park stadium)లో జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌కు బెదిరింపులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో భద్రతను పెంచారు. అయితే తాము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, తమకున్న సమాచారం మేరకు భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ముప్పులేదని న్యూయార్క్‌ గవర్నర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మన్‌హటన్‌(Manhattan)కు తూర్పున 25 మైళ్ల దూరంలో ఉన్న ఐసెన్‌హోవర్‌ పార్క్ స్టేడియం ఉంది. అక్కడ జూన్ 3 నుంచి జూన్ 12 వరకు జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేలా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్( Kathy Hochul) చెప్పారు. అధునాతన నిఘా, సెక్యూరిటీ స్క్రీనింగ్ వంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యూయార్క్ పోలీసులను ఆదేశించినట్లు గవర్నర్‌ తెలిపారు. ప్రజల భద్రతే తన మొదటి ప్రాధాన్యమని, క్రికెట్ వరల్డ్ కప్ సురక్షిత వాతావరణంలో ప్రజలంతా ఆస్వాదించేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు.



భద్రతకే తొలి ప్రాధాన్యం- ఐసిసి 


భారత్‌-పాక్ మ్యాచ్‌కు బెదిరింపులు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే న్యూయార్క్ సహా టోర్నమెంట్ అంతటా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయిస్తామని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌-ఐసిసి(ICC) తెలిపింది. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరి భద్రతా తమకు ముఖ్యమని ఐసీసీ అధికార ప్రతినిధి తెలిపారు. మ్యాచ్‌లను సజావుగా నిర్వహించేలా సమగ్రమైన, పటిష్టమైన భద్రతా ప్రణాళిక తమ వద్ద ఉందని చెప్పారు. ఇందుకోసం వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న దేశాల అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు.


భారత్ న్యూయార్క్ లో నాలుగు మ్యాచ్ లు ఆడుతుంది. జూన్‌ 5 జరిగే మ్యాచ్‌లో కెనడాతో తలపడుతుంది. తరువాత జూన్‌ 9న పాకిస్తాన్ ను ఢీకొట్టనుంది. జూన్ 12 న అమెరికా క్రికెట్‌ జట్టుతోనూ మ్యాచ్ ఉంది. అక్కడే బంగ్లాదేశ్‌ జట్టుతో భారత్‌ వార్మప్ మ్యాచ్ కూడా ఆడనుంది. టీమిండియా మే 28న అమెరికాకు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించింది. అమెరికా, వెస్టిండీస్‌ కలిసి ఈసారి టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. తద్వారా అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఐసీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు కట్టుబడి ఉన్నామని అమెరికా, వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డులు, ఐసీసీ ప్రకటించాయి.


Also Read: