Trending News In Telugu : ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వాళ్లకే స్థానిక సంస్థల్లో టికెట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు గత వారంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్‌గా మరింది. కొత్తగా పెళ్లైన దంపతులు 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదు అంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ప్రోత్సహిస్తున్న సీఎంల అసలు ఉద్దేశం ఏంటీ? ఎందుకు ఇంతలా పిల్లల్ని కనాలంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇద్దరు ముద్దు అంతకంటే వద్దని గతంలో విస్తృతంగా ప్రచారం చేశాయి ప్రభుత్వాలు. అలా మొదలైన నినాదం ఇప్పుడు ఇద్దరు వద్దు ఒకరే ముద్దు అన్నట్టు సాగుతోంది. పెరిగిన ఖర్చులు ఇతర కారణాలతో చాలా మంది ఒక బిడ్డ చాలులే అని సరిపెట్టుకుంటున్నారు. మారుతున్న జీవన ప్రమాణాల కారణంగా పిల్లలు లేని వారి సంఖ్య కూడా బాగానే ఉంటోంది. ఇదే ఇప్పుడు రాష్ట్రాల, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో జనాభా నియంత్రణకు చేపట్టిన చర్యలు తూచా తప్పకుండా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు వివపక్ష ఎదుర్కొంటున్నాయనే భావన బలపడుతోంది. సంతాన వృద్ధి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో చాలా తక్కువగా ఉంది. దీని వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి తోడు భవిష్యత్‌లో వర్కింగ్ గ్రూప్ కొరత కూడా ఉంటుదని లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించి జనాభా పెంచాలంటూ చంద్రబాబు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు దానికి ఇంకో కారణాన్ని జోడించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్... జనాభా పెంచాలంటూ చెబుతున్నారు. ఓ సామూహిక వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్టాలిన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్ల కేటాయింపు జరుగుతుందని తక్కువ జనాభా ఉన్న కారణంగా తమిళనాడు సీట్లు తగ్గే ప్రమాదం ఉందన్నారు. అందుకే కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదని ప్రశ్నించారు. గతంలో 16 ఐశ్వర్యాలతో జీవించాలని దీవించే వారని ఇప్పుడు 16 మంది పిల్లలతో జీవించండని దీవించాల్సి వస్తుందన్న భావనలో ఈ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు, స్టాలిన్ కామెంట్స్‌పై జనాభాపై చర్చ మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు భారీగా తగ్గిపోతుందని నాబార్డ్ లెక్కలు చెబుతున్నాయి. దీని కారణంగా కుటుంబాల్లో సభ్యుల సంఖ్య పడిపోతోంది. ఈ సగటు కుటుంబాల సంఖ్య జాతీయ సగటు 4.3 ఉంటే... ఏపీలో 3.7గా ఉంది. కర్ణాటకలో 4.3, తెలంగాణ, తమిళనాడు 4.1, కేరళ 3.8గా ఉన్నాయి. ఉత్తరాదిలో ఈ సగటు ఐదు వరకు ఉంది.
ఇలా కుటుంబాలు చిన్నబోవడంతోపాటు 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య పెరగడం కూడా ప్రమాదకరంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో యువ జనాభా బాగానే ఉన్నప్పటికీ మరో పదేళ్ల తర్వాత పరిస్థితి తారుమారు అవుతుందని అంటున్నారు. కుటుంబ నియంత్రణపై ఇప్పుడు అమలు చేస్తున్న విధానాలనే కంటిన్యూ చేస్తే వర్కింగ్ గ్రూప్‌పై ఎఫెక్ట్ పడుతుందని ఓ అంచనా. ఒక వేళ వృద్ధుల జనాభా పెరిగిపోతే సంక్షేమం, హెల్త్‌పై ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే టైంలో వర్కింగ్ గ్రూప్ ఎక్కువగా లేకపోవడంతో మనవ వనరులు లేక పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉంటుంది. లేకుంటే బయట నుంచి కార్మికులను, వర్కింగ్ పీపుల్‌ను రప్పించుకోవాలి.
ఇలాంటి పరిణామాలు ముందుగానే గ్రహిస్తున్న సీఎంలు జనాభాను పెంచాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతన్నారు. ఇప్పటికే వృద్ధ జనాభా అధికంగా ఉన్న జపాన్, చైనా లాంటి దేశాల్లో జనాభా పెంచాలంటూ ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. రేపు అలాంటి పరిస్థితి మనకు రాకూడదని మన ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. వర్కింగ్ గ్రూప్ తగ్గిపోకుండా సమతౌల్యత పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Also Read: జగన్ , షర్మిల మధ్య రాజీ - ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు ఖాయమా ?