అమరావతి/హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం (అక్టోబర్ 22) ఉదయం నాటికి వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం మరింతగా బలపడి ఆ మరుసటిరోజు అంటే బుధవారం (23 అక్టోబర్, 2024) నాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుని అక్టోబరు 24 ఉదయం నాటికి ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. నైరుతి దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు & దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం తాజాగా తమిళనాడులో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఓవైపు తీవ్ర వాయుగుండం ప్రభావం, మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు
ఏపీలో తుపాన్ ప్రభావంతో 24 గంటలపాటు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచనలో ఏపీలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమ జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకపోవడమే మంచిది.
తెలంగాణలో ఉక్కపోత, 2 ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఉక్కపోత వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అత్యధికంగా భద్రాచలంలో 34.4 డిగ్రీల ఉష్ణోగ్రత, నిజామాబాద్ లో 34.3 డిగ్రీలు, రామగుండంలో 32.4 డిగ్రీలు, ఆదిలాబాద్, దుండిగల్ లో 31.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో ఉదయం ఎండలు, సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతారణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
తుపానుపై కేంద్రం అలర్ట్
బంగాళాఖాతంలో తుపాను సందర్భంగా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. బంగాళాఖాతంలో బలపడే తుపాను సంసిద్ధతపై జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశమైంది. కేంద్ర కార్యదర్శులు, డిఫెన్స్ , డిజి ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, డిజి ఐఎండిలతో పాటు ఏపీ నుంచి పాల్గొన్న రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. తుపాను హెచ్చరిక సందర్భంగా ఏపీలో తీసుకున్న ముందస్తు చర్యలను స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వివరించారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, అత్యవసర సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించారు. విద్యుత్ ఆటంకం కలిగితే వెంటనే పునరుద్ధించడానికి అందుబాటులో సిబ్బంది ఉన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి వాతావరణ పరిస్థితి ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేస్తున్నారు. అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు, సహాయక శిబిరాలకు ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేశారు.