Why a political event in Tamil Nadu took DMK, BJP cadres by surprise : తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలను అక్కడి ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఏడాది పాటు నిర్వహించిన ఉత్సవాల ముగింపు సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యకరమైన బహుమతిని పంపింది. కరుణానిధి బొమ్మతో వంద రూపాయల నాణెన్ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. విడుదల కార్యక్రమాన్ని కరుణానిధి శత జయంతి ఉత్సవాల వేదికపైనే నిర్వహించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ, డీఎంకేల నేతలు పరస్పర పొగడ్తలు కురిపించుకున్నారు.
నిన్నామొన్నటి వరకూ నిప్పు, ఉప్పులా బీజేపీ, డీఎంకే
నిజానికి డీఎంకే , బీజేపీ మధ్య నిన్నామొన్నటి వరకూ పరిస్థితి ఉప్పూ.. నిప్పులా ఉండేది. ఈడీ దాడులు జరిగేవి. ఈ కారణంగా ఇద్దరు మంత్రులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మరో వైపు గవర్నర్ కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని చికాకు పెడుతూ ఉండేవారు. పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేసేసిన తర్వాత డీఎంకే మరింత బలోపేతం అయింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకేతో కలసి పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత వ్యూహం మార్చింది. డీఎంకేను తప్పు పట్టడం.. చికాకు పెట్టడం ఆపేసింది. అంతే కాదు కరుణానిధి శతజయంతి వేడుకల విషయంలో పూర్తి స్థాయిలో సహకరించింది. చివరికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా కరుణానిధిని ప్రశంసించడం మారిన బీజేపీ విధానానికి సాక్ష్యంగా మారింది.
డీఎంకే బీజేపీతో కలుస్తుందని ఊహాగానాలు
డీఎంకే, బీజేపీ మధ్య ఇలాంటి రాజకీయ వాతావరణం ఏర్పడటం అనూహ్యమే. ఇక ఆ రెండు పార్టీలు కలవబోతున్నాయని ప్రచారం చేయడానికి..జరగడానికి హద్దేముంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఇదే హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు కలుస్తాయా అన్న చర్చోపచర్చలు సాగుతున్నాయి. సిద్ధాంతపరంగా అయితే రెండు పార్టీలు కలవడం అనేది జరగదని.. కానీ రాజకీయంగా ఏదైనా జరగవచ్చన్న అంచనాలు ప్రారంభమయ్యాయి. కానీ అటు బీజేపీ, ఇటు డీఎంకే వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాయి. బీజేపీతో కలవడం అనేది అసాధ్యమని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. కరుణానిధిని వారు గౌరవించారు కాబట్టే తాము గౌరవించామని. .. అంతే కానీ ఇందులో రాజకీయం లేదంటున్నారు. అన్నామలై కూడా.. తాము ప్రత్యర్థులమని.. మిత్రులం కాదని చెబుతున్నారు.
పరస్పర ప్రయోజనాలను రెండు పార్టీలు ఆశిస్తున్నాయా ?
కారణం ఏదైనా డీఎంకే మొదటి నుంచి కేంద్రంలో పోరాటబాటలోనే ఉంది. ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంది . కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. కర్ణాటకలో గవర్నర్ ఏకంగా ముఖ్యమంత్రిగా విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కానీ గతంలో అలాంటి దూకుడే చూపించిన తమిళనాడు గవర్నర్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. బీజేపీ గతంలో తెలంగాణలో బాగా ఎదుగుతోందని ప్రచారం జరిగింది కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించలేదు. దాంతో.. వీలైనంత వరకూ మిత్రపక్షాలను పొందడం ముఖ్యం అనుకున్నారేమో కానీ వ్యూహం మార్చుకున్నారు. అన్నాడీఎంకేతో ఇప్పటికే విడిపోయారు. మళ్లీ కలవడం వల్ల ప్రయోజనం ఉండదని.. డీఎంకే అయితే బెటరన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే డీఎంకే వైపు మెల్లగా జరుగుతోందని భావిస్తున్నారు.
అయితే డీఎంకే మాత్రం.. ఇప్పటికిప్పుడు బీజేపీతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేకపోయినా.. పొత్తులు అనే మాట వచ్చే సరికి దూరం జరిగే అవకాశం ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీని వదిలే అవకాశం ఉండదని.. తమిళనాట సెక్యూలర్ వాదులు భావిస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని మరికొంత మంది వాదిస్తున్నారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ పాచికలు వేసినట్లు అర్థం చేసుకోవచ్చు.