History of Monarchs: 


"నేను మోనార్క్‌ని..నన్నెవరూ మోసం చేయలేరు"  అని ప్రకాష్ రాజ్ అప్పుడెప్పుడో డైలాగ్ చెబితే...ఇప్పటికీ ఆ మాటల్ని మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మూర్ఖత్వం, మొండితనం, నియంతృత్వం...ఇలాంటి లక్షణాలున్న ప్రతి వ్యక్తిని "మోనార్క్" (Monarch) అని పిలుస్తుంటారు. వందల ఏళ్ల క్రితమే పుట్టుకొచ్చిన ఈ పదం..ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్‌ ఇలానే ఉంటుంది. అందుకే ఆయనతో ఆ డైలాగ్ చెప్పించారు. అది సరే. ఇంతకీ మోనార్క్ అంటే ఏంటి..? ఎందుకా పేరొచ్చింది..? చరిత్ర ఏం చెబుతోంది..? 


మోనార్క్ అంటే..? (What is Monarchy)


మోనార్కియా (Monarkhia) అనే గ్రీకు పదం నుంచి పుట్టింది ఈ మోనార్కీ. గ్రీక్‌లో మోనోస్ (Monos) అంటే కేవలం, ఆర్కీ (arkhe) అంటే అధికారం. కేవలం ఒకరే అధికారంలో ఉండటాన్ని మోనార్కీ అంటారు. అంటే...ఓ దేశంపై సర్వాధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉండటం. ఏకఛత్రాధిపత్యం అన్నమాట. తనంతట తాను తప్పుకుంటే తప్ప ఆ పదవిలో ఇంకొకరు కూర్చోడానికి వీలుండదు. ఆ వ్యక్తి మృతి చెందే వరకూ అధికారంలోనే ఉంటాడు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లకు ఈ "మోనార్కీ" వారసత్వంగా వస్తుంది. కొన్నిసార్లు ఈ "మోనార్క్‌"లను ఎన్నుకుంటారు కూడా. తన మాటే చెల్లాలి. ఏదనుకుంటే అది జరిగిపోవాలి. ఏం చేసినా అడ్డు ఉండకూడదు. సింపుల్‌గా చెప్పాలంటే "ఎదురు లేని మనిషి" అన్నమాట. ఇలా ఉంటుంది మోనార్క్‌ల తీరు. పైగా...తమను దేవుడే భూమి మీదకు పంపి ఇలా అధికారం చేపట్టాలని ఆదేశించాడని తమ "మూర్ఖత్వానికి" జస్టిఫికేషన్ ఇచ్చుకుంటారు వీళ్లు. ఈ పదవిలో పురుషులు ఉంటే కింగ్ (King) అని పిలుస్తారు. స్త్రీలు ఉంటే "క్వీన్స్" (Queens) అని అంటారు. వీళ్ల కూతుళ్లు, కొడుకులు అధికారాన్ని "హక్కు"గా భావిస్తారు. 


మూలాలెక్కడ..? 


మోనార్కీ మూలాలెక్కడ అని చూస్తే...సుమేర్, ఈజిప్ట్‌ల నుంచి ఇది మొదలైందని చరిత్ర చెబుతోంది.  3000 BC లోనే ఇక్కడ మోనార్కీ పాలన మొదలైనట్టు హిస్టారియన్స్ అంటున్నారు. ఆ తరవాత గ్రీస్‌లోనే ఎక్కువగా కనిపించింది ఈ మోనార్కీ పాలన. గ్రీకులోని "Homers Iliad" బుక్‌ ఆధారంగా చూస్తే....కాంస్య యుగం తరవాత ఇటలీ, రోమ్‌లు 700 నుంచి 500 BC వరకూ మోనార్క్ పాలనలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తరవాత ఇథియోపియా, వెస్టర్న్ యూరప్, ఆఫ్రికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్‌లోనూ రాజులు, రాణుల పాలన కొనసాగింది. అమెరికన్, ఫ్రెంచ్, చైనీస్, రష్యన్ రెవల్యూషన్స్ మొదలయ్యాక..క్రమక్రమంగా అన్ని చోట్లా మోనార్కీ పాలనకు ఫుల్‌స్టాప్ పడుతూ వచ్చింది. అయితే...ఇప్పటికీ కొన్ని దేశాలు ఇలా "రాజులు, రాణుల" పాలనలోనే ఉన్నాయి. 


నాగరికత వాళ్లతోనే మొదలు..? 


మోనార్క్‌లు మూర్ఖులు అని ఎంత తిట్టుకున్నా...వాళ్లు కొన్ని మంచి పనులూ చేశారని అంటారు. కొన్ని దేశాల్లో నాగరికతకు వాళ్లే కారణమనీ అని వాదిస్తున్న వాళ్లూ లేకపోలేదు. హిస్టరీకి సంబంధించిన కొన్ని సైట్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే...ఎంత మంచి పనులు చేసినప్పటికీ వాళ్ల తీరుతో చరిత్రలో "మొండి ఘటాలుగా" మిగిలిపోయారు. కాలం, పరిస్థితులు ఆధారంగా వాళ్ల అధికారాల్లోనూ మార్పులు వచ్చాయి. అవి రానురాను మరీ కఠినంగా మారాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు...అరాచకంగా వ్యవహ రించేవారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే..ఓ సారి మోనార్కీగా ఉన్న వాళ్లు..ఏదైనా కారణంతో పదవి నుంచి తప్పుకుంటే మరోసారి
ఆ పదవిని చేపట్టేందుకు వీలుండదు. కానీ...బ్రిటన్ కింగ్ విలియమ్, క్వీన్ మేరీ మాత్రం ఈ రూల్‌ని బ్రేక్ చేశారు. 1689,1694లో వాళ్లే పరిపాలించారు. 


పిడివాదమే వాళ్ల సిద్ధాంతం 


మోనార్క్‌లు అనగానే  వెస్ట్రన్ దేశాలే గుర్తొస్తాయి. ఎందుకంటే...యూరప్ చాలా సంవత్సరాల పాటు మోనార్కీ పాలనలోనే ఉంది. 18వ శతాబ్దంలో రోమన్ల శకం ముగిసిపోయేంత వరకూ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. అయితే..ఈ మోనార్క్‌ల విషయంలోనూ విభజన ఉండటం ఆసక్తికర విషయం. 16వ శతాబ్దానికి ముందు పాలనను "Old Monarchy" అని ఆ తరవాత వచ్చిన వాళ్లను "New Monarchies" అని వర్గీకరించారు. అధికారాల విషయంలో ఈ రెండు వర్గాల మధ్య చాలా తేడాలే ఉన్నాయన్నది హిస్టారియన్ల మాట. Absolutism అనే సిద్ధాంతానికి కట్టుబడి వీళ్లు పరిపాలన సాగించేవారు. అంటే...పిడివాదం అన్నమాట. కేవలం మూర్ఖంగా వాదించి తాము అనుకున్నది చేసే వాళ్లు. వాళ్లను ఎవరూ ప్రశ్నించటానికి కూడా సాహసించే వాళ్లు కాదు. అయితే రానురాను...ఈ మోనార్కీ పాలన కాస్త సరళతరమవుతూవచ్చింది. అధికారాలు తగ్గాయి. మోనార్కీ ప్రభుత్వం స్థానంలో ప్రజాస్వామ్యం వచ్చింది. 1789లోని ఫ్రెంచ్ రివల్యూషన్ (French Revolution) ఇందుకు మంచి ఉదాహరణ. తరవాత జరిగిన ఉద్యమాలూ...మోనార్కీని చెరిపేశాయి. అయినా...ఇప్పటికీ కొన్ని దేశాల్లో మోనార్కీ కొనసాగుతూనే ఉంది. యూరప్‌లోని అండొర్రా, బెల్జియం, డెన్మార్క్, లీచ్‌టెన్‌స్టెయిన్, లగ్జంబర్గ్, మొనాకో, నెదర్లాండ్స్..తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆఫ్రికాలో ఎస్వాతిని, లెసొతో, మొరాకో, ఆసియాలో బహ్రెయిన్, భూటాన్, కాంబోడియా, జపాన్, జోర్డాన్, కువైట్, మలేషియా, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, థాయ్‌లాండ్‌లలో మోనార్కీ కొనసాగుతోంది. 


Also Read: TRS Tension : టీఆర్ఎస్ లీడర్లలో టెన్షన్ టెన్షన్ ! బీజేపీపై ఆ దూకుడు చూపించలేకపోతున్నారా ?


Also Read: Fake Police Station: ఓర్ని, పోలీసులకే టోపీ పెట్టారే, పోలీస్ స్టేషన్ పక్కనే నకిలీ పోలీస్ స్టేషన్ - 8 నెలల తర్వాత గుట్టురట్టు