Sri Sampath Vinayaka Temple: అది 1971 సంవత్సరం. ఇండియా - పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. ఆ సమయంలో తూర్పు నావెల్ కమాండ్‌కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి వచ్చి వైజాగ్ ను కాపాడాల్సిందిగా కొబ్బరికాయలు కొట్టారని అంటారు. ఆ తరువాత కొద్దిరోజులకే విశాఖ పై దాడికోసం రహస్యంగా వచ్చిన పాకిస్తాన్ సబ్ మెరైన్ PNS ఘాజీ 4 డిసెంబర్ 1971న సముద్రంలోనే పేలి, మునిగిపోయింది. దానితో స్వామి మహిమ వల్లే పాకిస్తాన్ సబ్ మెరైన్‌ని ముంచెయ్యగలిగామని భావించిన కృష్ణన్ విశాఖ లో ఉన్నంత వరకూ ప్రతీరోజూ సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తరువాతే విధులకు వెళ్లే వారట. ఆ ఘటన తరువాత వైజాగ్ లోని సంపత్ వినాయక్ ఆలయం పాపులారిటీ పెరగడానికి ఇది చాలా ఉపయోగపడింది అంటారు విశాఖ వాసులు.
తమిళ వ్యాపారులు ఏర్పాటు చేసిన వాస్తు గణపతే - ఈ సంపత్ వినాయకుడు :
విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద గల ‘‘సంపత్ వినాయక’’ లేదా “శ్రీ సంపత్ వినాయగర్” ఆలయం తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయ వైశాల్యం చాలా చిన్నగా ఉంటుంది. బొజ్జ గణపయ్య కొలువుతీరిన అతి బుల్లి ఆలయంగా దీన్ని చెప్పొచ్చు.. ఈ ఆలయంలో కొలువైన స్వామివారిని, సకల సంపదలూ అనుగ్రహించే దైవంగా, వాస్తుదోషం నివారణకు అధిష్టాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయాన్ని, ముగ్గురు ఒకే కుటుంబీకులు కలిసి కట్టించారు. తమ వ్యాపార కార్యాలయం ఎదుట వాస్తు దోష నివారణ కోసం వ్యక్తిగతంగా నిర్మించిన మందిరం “సంపత్ వినాయక” ఆలయం.విశాఖపట్నంలోని ఆసిల్ మెట్ట వద్ద ఉన్న ఈ ఆలయం S.G. సంబందన్ & కో. వారికి చెందినది.
1962వ సంవత్సరంలో S.G. సంబందన్, T.S. సెల్వంగనేషన్ మరియు టీ..ఎస్.రాజేశ్వరన్ లు వారి యొక్క, వారి కుటుంబ సభ్యుల యొక్క ఆరాధన కోసం, వారి వ్యాపార కార్యాలయ ప్రాంగణంలోనే నిర్మించి , వారి ఖర్చులతోనే ఆలయ నిర్వహణ చేపట్టేవారు. ఆ సంబధన్ వినాయగర్ తరువాతి కాలంలో సంపత్ వినాయకుడిగా మారింది అంటారు అప్పటి జనాలు. కొంతకాలం అయ్యాక, స్థానికమత్స్యకారులు (జాలర్లు) వారి రోజువారీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి ప్రతిరోజూ స్వామివారికి దీపం వెలిగించి, భక్తి శ్రద్ధలతో ప్రార్ధించి వెళ్లేవారు.. 1966-67 ప్రాంతంలో కంచి పీఠాధిపతి చంద్రశేఖరరేంద్ర సరస్వతి మహాస్వామి “మహాగణపతి యంత్రాన్ని” ఆలయంలో నిక్షిప్తం చేసారు.దానితో విశాఖ చుట్టుపక్కలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి సైతం సంపత్ వినాయక టెంపుల్ కి జనాలు క్యూ కట్టడం మొదలెట్టారు.
కొత్త వాహనం కొంటే ఇక్కడికి తీసుకురావాల్సిందే :
ఈ ఆలయంలో “వాహన పూజ” కి ఎంతో ప్రాముఖ్యం ఉంది. విశాఖలో లేదా చుట్టుపక్కల ఎవరైనా కొత్త వాహనము / వాహనములు కొనుగోలు చేస్తే, తప్పకుండా సంపత్ వినాయక ఆలయానికి వచ్చి తమ వాహనాలు పూజలు చేయించుకొంటారు. అది బైక్ నుండి ఖరీదైన కారు వరకూ ఏదైనా కావొచ్చు.. సంపత్ వినాయక టెంపుల్ లో పూజ చేశాకే రోడ్డెక్కాలి. అదీ ఇక్కడి ప్రజల నమ్మకం. అలా పూజ చేయించడం సర్వ శుభప్రదమని, ఇక్కడ పూజలు చేసిన వాహనాలకు ఎలాంటి ప్రమాదమూ జరగదని భక్తుల నమ్మకం అందుకే, ఈ ఆలయంలో “వాహన పూజలు” విశేషంగా జరుగుతాయి.
గణపతి నవరాత్రులు వచ్చాయంటే కన్నుల పండుగే :
విశాఖనగర నడిబొడ్డున వెలసిన ఈ సంపత్ వినాయకుని దర్శించి, అర్చించినంతనే ఎన్నో సమస్యలు వెంటనే పరిష్కారమౌతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సకల విఘ్నాలను హరించి తనను కొలిచేవారికి సంపదలిచ్చే దేవుడిగా ఈ సంపత్ వినాయకుడు ప్రసిద్ధుడు. ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా బుధ, శుక్ర వారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పర్వదినాల్లో అయితే, ఈ ఆలయం భక్తజన సంద్రమే.
భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లే ఈ స్వామిని దర్శించి సేవించడానికి విశాఖపట్నం నుంచేకాక చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తారు.
సంపత్ వినాయగర్ స్వామికి నిత్యం జరిగే “గరిక పూజ”, “ఉండ్రాళ్ళ నివేదన”, “అభిషేకము”, “గణపతి హోమం”, “నిత్య పూజలు”, “వాహన పూజలు”, ప్రతీ మాసంలో బహుళ చతుర్థినాడు జరిగే “సంకష్టహర చతుర్థి” పూజలతో ఆలయం బహు శోభాయమానంగా ఉంటుంది. ఈ స్వామి వారికి వివిధ పదార్ధాలతో జరిగే అభిషేకము చాలా వైభవంగా ఉంటుంది. గంధోదకం, హరిద్రోదకం, ఆవుపాలు,పెరుగు, ఆవునెయ్యి, కొబ్బరి నీళ్లు, ఫలరసాలు, తేనే, శుద్ధోదకం, పంచదారాల తో స్వామివారికి అభిషేకం ఏంతో నేత్రానందంగా నిర్వహిస్తారు. తరువాత, అర్చకస్వాములు, స్వామివారికి చేసే అలంకారం అదొక “ప్రత్యేకత” అంటే అతిశయోక్తి కాదు.
ప్రవేశం ఉచితం :
ఈ ఆలయంలో సర్వ దర్శనానికి ఎటువంటి ఫీజు లేదు. ఉదయం 6 గంటల నుండి 10.30 గంటల వరకు, సాయింత్రం 5.30 నుండి రాత్రి 8.30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో “ఆంగ్ల” సంవత్సరాదితో పాటు, తెలుగు సంవత్సరాది ‘‘ఉగాద’’ నాడు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
భాద్రపద శుద్ధ చవితి “వినాయక చవితి” అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజులపాటు స్వామివారిని వివిధ రూపాలలో అలంకరిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో స్వామివారిని బాల గణపతి, ఆది గణపతి, విద్యా గణపతి, రాజ గణపతి, శక్తి గణపతి, శివపూజ గణపతి, స్కంద గణపతి, అగస్త్యపూజ గణపతి, సిద్ధి బుద్ధి గణపతి అవతారాలలో అలంకరిస్తారు.
ఈ ఉత్సవాలలో, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన సంతర్పణలు విశేషంగా నిర్వహిస్తారు.ప్రస్తుతానికి దేవాదాయ శాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ ఆలయం లోని పూజలు ,ఉత్సవాలు అన్నీ దీన్ని స్థాపించిన సంబధన్ కుటుంబీకులు వారు స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరగడం విశేషం.అందుకే ఈ ఆలయంలో తెలుగు - తమిళ సంప్రదాయాల కలయికలో పూజలు జరుగుతుంటాయి. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే తప్పకుండా విజిట్ చెయ్యాల్సిన ప్రదేశాల్లో ఒకటి ఈ సంపత్ వినాయక టెంపుల్.