NTR Politics :  అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు వినిపించడం ఎక్కువ అయింది. అయిన దానికి కాని దానికి ఎన్టీఆర్ పేరును తెర ముందుకు తీసుకు వస్తున్నారు వైఎస్ఆర్‌సీపీ, బీజేపీ నేతలు. ఆయన టీడీపీని లాక్కుంటారని కొడాలి నాని అంటున్నారు. అమిత్ షాతో ఎన్టీఆర్ కలిసినప్పుడు రాజకీయాలు మాట్లాడకుండా ఎలా ఉంటారని జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. కానీ ఏం మాట్లాడి ఉంటారో తెలియంటున్నారు. ఇక్కడ జీవీఎల్ నరసింహారావు ఏపీ బీజేపీ వ్యవహారాల్లో కీలకం అయితే.. అటు కొడాలి నాని ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇప్పుడు ఆ సంబంధాలు ఉన్నాయో లేదో క్లారిటీ లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం పదే పదే రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఆయన వెనుకాడటం లేదు. 


అమిత్ షాతో భేటీతో జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయ రంగు !


కొమురం భీం  పాత్రలో ఎన్టీఆర్ నటన నచ్చి అమిత్ షా విందుకు పిలిచాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇది అధికారికంగా వచ్చిన సమాచారం. అనధికారికంగా ఎంతో రాజకీయం ఉందని అంటున్నారు కానీ అది ఎలాంటి రాజకీయమో ఎవరూ చెప్పడం లేదు. ఈ భేటీపై అటు అమిత్ షా.. ఇటు ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. కేవలం కలిశాము అనే సమాచారం ఇచ్చారు.. ఏం చర్చించారన్నది చెప్పలేదు. ఆ ట్వీట్లలో ఎక్కడా "పొలిటికల్ స్మెల్" కూడా రాలేదు. కానీ బయట రాజకీయం మాత్రం రచ్చ రచ్చ అయిపోతోంది. ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ను విస్తృతంగా వాడేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు ఎన్టీఆర్‌ను ఎలా చూపించాలో అలా చూపించేందుకు  ప్రయత్నిస్తున్నాయి. 


ఎన్టీఆర్ తమ వాడని చెబుతున్న బీజేపీ !


ఎన్టీఆర్ తమ వాడన్నట్లుగా బీజేపీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అనగానే.. వెల్కం అంటూ ఏపీ బీజేపీ నేతలు ట్వీట్లు చేశారు. అంటే ఎన్టీఆర్‌ వచ్చేసి బీజేపీలో చేరుతున్నట్లుగా వారు చూపించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా అదే పని చేస్తున్నారు. అమిత్ షాతో భేటీ అయ్యారంటే ఆయన బీజేపీ సానుభూతిపరుడేనని కొంత మంది విశ్లేషిస్తున్నారు. అయితే ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసిన కిషన్ రెడ్డి అధికారికంగా ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని.. కేవలం సినిమాల గురించే చర్చించారని చెప్పుకున్నారు. కానీ  జీవిఎల్ నరసింహారావు లాంటి వాళ్లు రాజకీయాలు చర్చించకుండా ఎలా ఉంటారని అంటున్నారు. మొత్తంగా బీజేపీ నేతలు..  ఎన్టీఆర్‌ను తమ సానుభూతిపరుడిగా చూపించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. 


టీడీపీని విమర్శించడానికి ఎన్టీఆర్‌ను వాడుకుంటున్న వైఎస్ఆర్‌సీపీ !


అమిత్ షా - ఎన్టీఆర్ మధ్య భేటీ జరిగితే ఎక్కువగా స్పందిస్తోంది వైఎస్ఆర్‌సీపీనే. ఈ విషయంలో ఆ పార్టీలో మాజీ మంత్రి కొడాలి నానికి మీడియా ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి కారణం  ఉంది. కొడాలి నాని ఒకప్పుడు ఎన్టీఆర్‌కు ఆత్మీయుడిగా పేరు ఉంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఎన్టీార్ సినిమాలు చేస్తున్న తొలి రోజుల్లో కొడాలి నానిపై కాలు వేసుకుని కూర్చున్న ఫోటో అది. అప్పట్లో అంత సాన్నిహిత్యం వారి మధ్య ఉండేది. ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన రోజుల్లో ఆయన ఒత్తిడితోనే గుడివాడలో సీనియర్ నేతలుగా ఉన్న వారిని కాదని కొడాలి నానికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారని చెబుతూంటారు. తర్వాత సంబంధాలు దెబ్బతినడంతో కొడాలి నాని వైఎస్ఆర్‌సీపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ..కొడాలి నాని మధ్య గత ఆత్మీయత ఉందన్న అంశంపై స్పష్టత లేదు. తర్వాత వారు బహిరంగంగా ఎక్కడా కలవలేదు. కానీ వారి మధ్య సంబంధాలు ఉన్నాయని.. కొంత మంది చెబుతూ ఉంటారు. అయితే కొడాలి నాని ఇప్పుడు ఎన్టీఆర్ విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీని కార్నర్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు.  రెండు రోజులుగా ఆయన ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావిస్తారు. తాజాగా టీడీపీని ఎన్టీఆర్ స్వాధీనంచేసుకుని వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారని.. ఆయనపై జగనే గెలుస్తారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కూడా ఎన్టీఆర్ ను ఉపయోగించుకుని ప్రచారాలు చేస్తోంది. 


గుంభనంగా టీడీపీ !


ఎన్టీఆర్ రాజకీయంగా స్థిరంగా ఉండిపోయారు. కొన్నాళ్లుగా ఆయన రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ కూడా  రాజకీయ పరమైన చర్చల్లో ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించడం లేదు. అమిత్ షాతో భేటీ అయినప్పుడు వివిధ రకాలుగా ఊహాగానాలు వస్తున్న సందర్భంలో ఒకరిద్దరు నేతలు మాత్రం.. అది రాజకీయాలకు సంబంధం లేని భేటీగానే పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలు చేస్తున్న విమర్శలను కూడా పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్‌ను ఉపయోగించుకుని తమ పార్టీని టార్గెట్ చేస్తున్నా స్పందించడం లేదు. 


జూనియర్ ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తారా !?


కట్టె కాలే వరకూ తనది టీడీపీనేనని ఎన్టీఆర్ గతంలో ఎన్నో సార్లు చెప్పారు. నిజానికి ఆయనను మరో పార్టీలో ఎవరూ ఊహించలేరు కూడా. టీడీపీకి భవిష్యత్‌లో ఉండే  లీడర్లలో ఆయన కూడా ఒకరని అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. రాజకీయంగా చిన్న ఫోకస్ కూడా తనపై పడటానికి ఇష్టపడటం లేదు. చివరికి సోదరి సుహాసిని కూకట్‌పల్లిలో పోటీ చేసినా ప్రచారం చేయలేదు. పేపర్ ప్రకటన మాత్రం ఇచ్చారు. అలాగే ఇటీవల ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తె , చంద్రబాబు సతీమణిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో  కూడా ఆయన స్పందించారు కానీ.. ఎక్కడా రాజకీయ వాసననలు రానివ్వలేదు. అంత కేర్‌ఫుల్‌గా ఉంటున్న ఎన్టీఆర్ .. అమిత్ షా తో భేటీ  విషయంలో తనపై ఊహాగానాలు వస్తాయని తెలిసినా ముందుడుగు వేశారు. ఇప్పుడు ఆయన ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఆయన పేరు ప్రచారం అవుతోంది. ఎవరెవరో మాట్లాడితే సరే కానీ.. ఆయనకు ఆత్మీయులు అయిన వారే మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి విషయాల్లో అయినా జూనియర్ క్లారిటీ ఇస్తారా ?  ఓ ప్రకటన ద్వారా వీటన్నింటికీ ముగింపునిస్తారా?