WhatsApp Threatens to Exit India: వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ యాప్‌లోని ఎన్‌క్రిప్షన్‌ని బ్రేక్‌ చేయాలని చెబితే భారత్‌లో ఇకపై సేవలు అందించడం కష్టమే అని తేల్చి చెప్పింది. ఢిల్లీహైకోర్టులో ఐటీ చట్టంలో సవరణలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ విచారణ సమయంలో వాట్సాప్ ఈ వ్యాఖ్యలు చేసింది. 2021 నాటి ఐటీ చట్టంలోని డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌కి సంబంధించిన నిబంధనలను మెటా సవాల్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏదైనా మెసేజింగ్ సర్వీస్‌లు అందిస్తుంటే అందులోని మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించాలని ఈ నిబంధనలు తేల్చి చెబుతున్నాయి. అంటే...మెసేజ్‌ల మూలాలను గుర్తించడం. కంప్యూటర్ రీసోర్స్‌ల ద్వారా ఆరిజినేటర్‌ని గుర్తించాలని ఐటీ చట్టంలో స్పష్టంగా ప్రస్తావించారు. అయితే...దీనిపై వాట్సాప్‌ అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థ తరపున వాదించిన అడ్వకేట్ తేజస్ కరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవసీ ఉంటుందనే కారణంగానే చాలా మంది వాట్సాప్‌ని వినియోగిస్తున్నారని, ఇందులో End to End Encryption ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ నిబంధన ప్రకారం మెసేజ్‌ల మూలాలు గుర్తించాలంటే ఈ ఎన్‌క్రిప్షన్‌ని బ్రేక్ చేయాల్సి ఉంటుందని కోర్టుకి వెల్లడించారు. 


అదే జరిగితే భారత్‌లో సేవలు కొనసాగించలేమని స్పష్టం చేశారు. ఈ నిబంధన వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగిస్తోందని వాదించారు. ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే చట్టంలో ఇలాంటి రూల్స్ పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఈ చట్టంలో ఉన్నట్టుగా చేయాలంటే వాట్సాప్‌ ఏటా లక్షలాది మెసేజ్‌లను స్టోర్ చేయాల్సి ఉంటుందని వాట్సాప్ తరపున న్యాయవాది వాదించారు. ఎప్పుడు ఏ మెసేజ్‌ని డీక్రిప్ట్ చేయమని చెబుతారో తెలియనప్పుడు, అన్ని మెసేజ్‌లనూ స్టోర్ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అంతకు ముందు చట్టంలో ఇలాంటి నిబంధన లేదని వాదించారు. ఆ సమయంలో ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. ఇలాంటి నిబంధన ఇంకెక్కడైనా ఉందా అని అడిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి రూల్ లేదని తేజస్ కరియా స్పష్టం చేశారు.