ABP  WhatsApp

Russia Ukraine Conflict: రష్యా యుద్ధ తంత్రం- భారత్ శాంతి మంత్రం- అమెరికా హెచ్చరికల పర్వం

ABP Desam Updated at: 22 Feb 2022 04:03 PM (IST)
Edited By: Murali Krishna

రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ భారత్, అమెరికా ఏమంటున్నాయి. రష్యా దూకుడుకు కళ్లెం పడుతుందా? ఏ దేశం ఏమంటుంది.

ఉక్రెయిన్- రష్యా వివాదం

NEXT PREV

Russia Ukraine Conflict:


'ఉక్రెయిన్‌పై ఏ క్షణమైనా రష్యా దాడి చేయొచ్చు' ఇది అమెరికా నిఘా సంస్థ చెబుతోన్న మాట. 


'మా సార్వభౌమాధికారం, సమగ్రత జోలికి వస్తే వెనక్కి తగ్గేదే లేదు' ఇది రష్యా తాజా ప్రకటన.


'మేం ఎవరికీ భయపడేది లేదు. దేశం కోసం ప్రాణాలైనా వదిలేస్తాం.. కానీ రష్యాకు తలొగ్గేదే లేదు' ఇది ఉక్రెయిన్ వాదన.


ఇదీ ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య పరిస్థితి. మొన్నటి వరకు అఫ్గానిస్థాన్‌ ఉద్రిక్తతలతో అట్టుడికిన ఆసియా.. మరో బలమైన వివాదం మధ్యలో చిక్కుకుంది. ఇవన్నీ మాటలకే పరిమితం..  చేతల్లో ఏం కాదు.. అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉక్రెయిన్‌పై దండయాత్ర చేసితీరతారని అమెరికా నిఘా వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. అంతవరకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని మరోవైపు ఉక్రెయిన్ మాటల తూటాలు పేలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ సహా అమెరికా, రష్యా, ఉక్రెయిన్ వాదన ఎలా ఉందో ఓ సారి చూద్దాం.


రష్యా దూకుడు


గత వారం తమ సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు నుంచి వెనక్కి రప్పించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. తాజాగా దూకుడు పెంచారు. ఏకంగా
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తామన్నారు. ఈ ప్రాంతాలకు రష్యా నుంచి మిలిటరీ సహకారం ఉంటుందని తెలిపారు. 



ఉక్రెయిన్‌ను తోలుబొమ్మను చేసి బయటి శక్తులు నియంత్రిస్తున్నాయి. ఉక్రెయిన్‌.. రష్యాను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు యత్నిస్తోంది. ఉక్రెయిన్‌.. రష్యా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. రష్యాకు కలుగుతున్న ముప్పుపై స్పందించకుండా ఉండలేం. నాటోలో ఉక్రెయిన్‌ను చేర్చకూడదనేదే మా డిమాండ్‌. రష్యాపై వ్యతిరేక చర్యలను అడ్డుకునే హక్కు మాకుంది.                                          - వ్లాదిమిర్​ పుతిన్‌, రష్యా అధ్యక్షుడు


ఉక్రెయిన్ తగ్గేదేలే


రష్యా నిర్ణయంపై ఉక్రెయిన్ మండిపడింది. ఉక్రెయిన్ ఎవరికీ భయపడేది లేదని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్​స్కీ అన్నారు. 



దౌత్యపరమైన మార్గానికి మేం కట్టుబడి ఉన్నాం. మేం ఆ మార్గాన్ని మాత్రమే అనుసరిస్తాం. ఇతరుల నుంచి మేం వేటినీ కోరుకోవడం లేదు. మా నుంచి ఇతరులకు ఏమీ ఇచ్చేది లేదు. మా భాగస్వామ్య దేశాల నుంచి స్పష్టమైన, సమర్థవంతమైన చర్యలను ఆశిస్తున్నాం. ఎవరు నిజమైన మిత్రులో, ఎవరు మాటలతోనే సరిపెడతారో తెలుసుకోవాలని అనుకుంటున్నాం.                                      - వొలొదిమిర్ జెలెన్​స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు


అమెరికా హెచ్చరికలు


తూర్పు ఉక్రెయిన్​లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ రష్యా చేసిన ప్రకటనపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాపై అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆంక్షలు విధించినట్లు శ్వేతసౌధం తెలిపింది.


ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెనెస్కీకు బైడెన్ ఫోన్ కూడా చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్​కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


భారత్ శాంతిమంత్రం


రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత్ స్పందించింది.  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.



రష్యా- ఉక్రయిన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనగా ఉంది. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలకు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలి. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించాలి.                                                 -  భారత్


Also Read: Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌లో హైటెన్షన్- విద్యార్థులారా వచ్చేయండి, విమానాలు పంపిస్తున్నాం!


Also Read: Crude Oil Price Hike: 8 ఏళ్ల గరిష్ఠం 100 డాలర్లకు ముడిచమురు - ఇక భారత్‌లో ధరల మోతే!

Published at: 22 Feb 2022 03:58 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.