What is terrorist Noor doing in Dharmavaram : అనంతపురం జిల్లా ధర్మవరంలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జేషే మహమ్మద్ కు చెందిన నూర్ మహమ్మద్ షేక్ (40) అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలోని కోట ప్రాంతంలో నివసిస్తున్న నూర్, స్థానిక హోటల్‌లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఎన్‌ఐఏ అతని నివాసంలో సోదాలు చేసి 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. నూర్ జైషే మహ్మద్‌కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడని, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వ్యాఖ్యలు చేశాడని నిఘా సంస్థలు గుర్తించాయి. స్థానిక పోలీసులు మొదట అతన్ని అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఎన్‌ఐఏ విచారణకు అప్పగించారు. ప్రస్తుతం అతన్ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.
జైషే మహ్మద్ 2000లో మౌలానా మసూద్ అజహర్ స్థాపించిన ఉగ్రవాద సంస్థ. భారత్‌పై దాడులు చేయడం దీని లక్ష్యం. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడి వంటి ఘటనలకు ఈ సంస్థ బాధ్యత వహించింది. మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో .. అతని ముఠాను భారత్ టార్గెట్ చేసింది. అయితే అతని ఉగ్రవాద సంస్థలోనే పని చేస్తూ.. నూర్ ఏపీలో మకాం పెట్టడం సంచలనంగా మారింది.
ఎన్‌ఐఏ మరియు ఐబీ అధికారులు నూర్ కార్యకలాపాలు, అతని సంబంధాలు, ఇతర ఉగ్రవాద కనెక్షన్లపై లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. నూర్‌తో పాటు, ఎర్రగుంట ప్రాంతానికి చెందిన రియాజ్ అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతను పాకిస్తాన్ జెండాతో సంబంధం ఉన్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన ధర్మవరంలో కలకలం సృష్టించింది. స్థానికులు, ముఖ్యంగా కోట ప్రాంతంలో నివసించే వారు, ఎన్‌ఐఏ సోదాలతో ఉలిక్కిపడ్డారు.
ఏపీలో ఉగ్రవాదుల్ని అరెస్టు చేయడం ఇదే మొదటి సారి కాదు. కొద్ది రోజుల కిందట అన్నమయ్య జిల్లాలో ఇద్దరు తమిళనాడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారి పేర్లు అబుబక్కర్ సిద్దీక్ , మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్. అన్నమయ్య జిల్లాలో జూలై 1, 2025న తమిళనాడు యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. ఈ ఇద్దరూ దాదాపు 30 సంవత్సరాలుగా సిద్దీక్ 1995 నుంచి, అలీ 1999 నుంచి పరారీలో ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలలో జరిగిన బాంబు దాడులతో సహా బహుళ ఉగ్రవాద కేసులలో నిందితులుగా ఉన్నారు. వారి తలపై ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఈ అరెస్టులు రాయచోటి పట్టణంలో జరిగాయి, ఇక్కడ వారు రెండు దశాబ్దాలకు పైగా నకిలీ గుర్తింపులతో నివసిస్తూ, చిన్న వ్యాపారాలు నడుపుతూ దాక్కున్నారు.
టెర్రరిస్టులకు ఇలా ఏపీ షెల్టర్ జోన్ గా మారిందా.. ఇక్కడ ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలను చేపడుతున్నారా అన్నది విచారణలో తేాలాల్సి ఉంది. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు వీరు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.