Sedition Law: ఇంకా 'దేశద్రోహమా'.. పిచ్చోడి చేతిలో రాయిలా చట్టమా?!

ABP Desam Updated at: 16 Jul 2021 07:08 PM (IST)

దేశద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతపై అభిప్రాయాన్ని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది. అసలు ఈ చట్టంలో ఏముంది? ప్రభుత్వాలు దీనిని ఎలా ఉపయోగిస్తున్నాయి?

sedition law

NEXT PREV

ప్రభుత్వ విధానాలు నచ్చలేదా? విమర్శించారా..? అయితే దేశద్రోహమే


పార్లమెంట్ చేసిన చట్టాలు నచ్చలేదా..? రాస్తారోకో చేశారా? అయితే ఇక దేశద్రోహమే


పేకాట ఆడేవారిపై, రాజకీయ ప్రత్యర్థులపై ఇలా ఎవరు నచ్చకపోయినా వారిపై దేశద్రోహమే


ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది ఇదే.. ఇవి ఎవరో అన్న మాటలు కాదు సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పినవి.



"ఈ చట్టంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పేకాట ఆడేవారిపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్షనిస్టులు.. ప్రత్యర్థులపై రాజద్రోహం మోపేలా వ్యవహరిస్తున్నారు. సెక్షన్ 124- ఏ పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది."                             -    - సుప్రీం కోర్టు


 దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఈ వ్యాఖ్యలు చేసిందంటే.. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందనే విశ్లేషణలు వెల్లవెత్తుతున్నాయి. అసలు సుప్రీం కోర్టు వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి?


ఇంకా అవసరమా..?


స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా 'దేశద్రోహ చట్టం' అవసరమా అని సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తూ వ్యాఖ్యానించింది. స్వాంతంత్య్రం కోసం పోరాడుతున్న వారిపై బ్రిటిష్ వాళ్లు ఈ చట్టాన్ని ఉపయోగించేవారని, మహాత్మాగాంధీ, బాలగంగాధర తిలక్ లాంటి వారిపై ఉపయోగించిన ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని భారత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.





"కాలం తీరిన ఎన్నో చట్టాలను మీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, దేశద్రోహం అభియోగాన్ని మోపే ఐపీసీలోని 124ఏ సెక్షన్‌ను ఎందుకు తొలగించ లేదో అర్దం కావడం లేదు. ఇది బ్రిటిష్ వారు తెచ్చిన చట్టం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. ఈ సెక్షన్ అవసరం ఇప్పటికీ ఉందని అనుకుంటున్నారా?'' వాస్తవంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఒకరు చెప్పిన మాట అవతలి వ్యక్తి వినకపోతే వారి మీద సెక్షన్ 124 ఏ ఉపయోగిస్తున్నారు. ఇది వ్యక్తులు, సంస్థల మనుగడకు ప్రమాదంగా మారింది''            -  - సుప్రీం ధర్మాసనం




కొన్ని చట్టాలను దుర్వినియోగం చేయడంపై, బాధ్యతారహితంగా వ్యవహరించడంపైనే తమ ఆందోళన అని చీఫ్ జస్టిస్ రమణ అన్నారు. ఇటీవల రద్దు చేసిన 66 ఏ సెక్షన్‌ కింద ఇంకా కేసులు నమోదవుతున్న సంఘటనలను ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం గుర్తు చేసింది.

 

కేంద్రం అభ్యంతరం..



అయితే సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. సెక్షన్‌ 124 ఏ ను ఇప్పటికిప్పుడు రద్దు చేయాల్సిన అవసరం లేదని, దానిని చట్టబద్దంగా వినియోగించేందుకు కొన్ని విధివిధానాలు( గైడ్‌లైన్స్) తయారు చేస్తే సరిపోతుందని వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు.




కానీ సెక్షన్ 124 ఏ కింద నమోదవుతున్న కేసుల్లో నేర నిరూపణ రేటు చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని కూడా సుప్రీం కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.


అసలు చట్టంలో ఏముంది?


చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటల ద్వారా, రాతల ద్వారా, సైగల ద్వారా, దృశ్య మాధ్యమం ద్వారా ప్రజల్లో అసంతృప్తిని, విద్వేషాన్ని, ధిక్కారాన్ని రగిల్చినా, అందుకు ప్రయత్నించినా రాజద్రోహమే అవుతుంది. గరిష్ఠంగా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. జరిమానా కూడా విధించవచ్చు. మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. లేదా కేవలం జరిమానాతో వదిలేయవచ్చు. రాజద్రోహం కేసు పెడితే బెయిలు రాదు. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. పాస్‌పోర్టు ఇవ్వరు. పిలిచినపుడల్లా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. 




సవాల్ చేస్తూ..


దేశద్రోహ చట్టం రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ మాజీ సైనికాధికారి ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. ఇదే అంశంపై దాఖలైన మరికొన్ని పిటిషన్‌లను కూడా దీనికి జత చేసింది.




ఈ పిటిషన్ వేసిన సైనికాధికారి తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని, ఆయన పిటిషన్‌ను దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్‌గా భావించలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.




భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ చట్టం అడ్డుగా నిలుస్తోందని, ప్రాథమిక హక్కులను అడ్డుకుంటోందంటూ దీని రాజ్యాంగ బద్ధతను పరిశీలించాల్సిందిగా మేజర్ జనరల్(రిటైర్డ్) ఎస్.జి. వొంబాత్కేరే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 124 ఏ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.




ఈ సెక్షన్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ఇద్దరు జర్నలిస్టులు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టుకు చెందిన మరో ధర్మాసనం, దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


ఇటీవల కేసులు..



  1. కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని ప్రేరేపించేలా రెచ్చగొడుతుండడం వంటి ఆరోపణలతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.

  2. గత ఏడాది సెప్టెంబర్‌లో యూపీలోని హత్రస్ లో సామూహిక అత్యాచారానికి గురై 19 ఏళ్ల దళిత మహిళ మరణించిన సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన కేరళ జర్నలిస్టు సిద్దిఖి కప్పన్‌ను, మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రాజద్రోహ నేరంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం క్రింద కూడా కేసు మోపారు.

  3. బెంగళూరుకు చెందిన 23 సంవత్సరాల పర్యావరణ కార్యకర్త దిశారవి సాగు చట్టాలపై రైతుల నిరనస ప్రదర్శనకు సంబంధించి ఒక టూల్‌ కిట్‌ను సోషల్‌ మీడియాలో పంచిపెట్టినందుకు 2020 ఫిబ్రవరి 13న దిల్లీ పోలీసులు అరెస్టు చేసి రాజద్రోహ నేరం మోపారు. వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పర్చడం కానీ, టూల్‌కిట్‌ను రూపొందించడం కానీ నేరం కాదని దిల్లీ కోర్టు ప్రకటించి ఆమెకు బెయిల్‌ ఇచ్చింది. ఎర్రకోట వద్ద నిరసనలు తెలిపిన అనేక మందిపై కూడా సెక్షన్‌ 124 ఏ కింద కేసులు మోపారు.

  4. కమ్యూనిస్టు మేనిఫెస్టో, మావో జీవిత చరిత్ర చదవడం, స్నేహితులను కామ్రేడ్‌ అని, లాల్‌ సలామ్‌ అని పిలిచినందుకు 2019 సెప్టెంబర్‌లో అసోంలో రైతు నేత, హక్కుల కార్యకర్త అఖిల్‌ గొగోయిపై రాజద్రోహ నేరం మోపారు.

  5. 2016లో జేఎన్‌యూ క్యాంపస్ లో రాజద్రోహ పూరితమైన నినాదాలు చేశారంటూ విద్యార్థి సంఘం మాజీ నేత కన్హయ్య కుమార్‌, ఉమర్‌ ఖాలిద్‌, అనిర్బన్‌ భట్టాచార్యతో పాటు పది మందిపై రాజద్రోహ నేరం మోపారు.

  6. లక్షద్వీప్లో కొవిడ్‌-19 వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఇటీవల మోడల్‌ ఆయేషా సుల్తానాపై రాజద్రోహ నేరం మోపారు.

  7. సోషల్‌ మీడియాలో కార్టూన్లు షేర్‌ చేసినందుకు మణిపూర్‌క చెందిన కిషోర్‌ చంద్ర వాంగ్‌ ఖేమ్చా, ఛత్తీస్ గఢ్ కు చెందిన కన్హయ్యలాల్‌ శుక్లాపై రాజద్రోహనేరం మోపారు. 


ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు.. ఈ రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధతపై విచారణ చేసేందుకు సిద్ధమైంది.


Published at: 16 Jul 2021 11:46 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.