అన్నం పెట్టండంటూ చేతులు చాచిన లంక ప్రజలు..


యుద్ధం చేయాలనుకుంటే చాలదు. చేతిలో ఆయుధం కూడా కావాలి. ఖాళీ చేతుల్తో యుద్ధ రంగంలో ఎవరూ నిలబడలేరు. నిలబడకూడదు కూడా. ఇదే యుద్ధ రీతి. ఇప్పుడిదంతా ఎందుకంటరా..? ఈ మాటల్ని, ప్రస్తుత శ్రీలంక సంక్షోభాన్ని పోల్చి చూసుకుంటే అర్థమవుతుంది... ఎందుకీ ప్రస్తావన వచ్చిందో. పరిపాలన కూడా యుద్ధం లాంటిదే. సమస్యల శత్రువులు ఎదురైతే, వాటి అడ్డు తొలగించే ఆయుధాలు పాలకుడి చేతిలో కచ్చితంగా ఉండాలి. ద్వీప దేశంలో అదే కరవైంది. అద్భుతాలు సృష్టించాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ, ఆ క్రమంలోతీసుకున్న నిర్ణయాలు మిస్‌ఫైర్ అయితే ఎలా తప్పించుకోవాలన్నదీ తెలియాలి. ఇది ఓ రూలర్‌కు ఉండాల్సిన కనీస క్వాలిఫికేషన్. శ్రీలంకలో ఇప్పుడు చీకట్లు అలుముకోటానికి కారణం..ఈ దేశ అధినేతలకు ఆ లౌక్యం లేకపోవటమే. అందుకే ఇప్పుడక్కడ భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. "ఎవరైనా అన్నం పెట్టండయ్యా" అని లంక ప్రజలు ఇరుగుపొరుగు దేశాలను చేయి చాచారంటే పాలకుల సమర్థత ఏపాటిదో అర్థమవటం లేదూ..? 


పునాదులతో సహా కదిలిన ఆర్థిక వ్యవస్థ..


ఇప్పటికిప్పుడు పేకమేడలా ఏమీ కుప్పకూలిపోలేదు ఈ ఆర్థిక వ్యవస్థ. ఊగిసలాడి, ఊగిసలాడి ఇప్పుడు మొత్తంగా పునాదులే కదిలిపోయి, పతనమైపోయిన దేశమిది. ఒకటా రెండా..? ఎన్ని అనాలోచిత నిర్ణయాలని..! వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వ్యవసాయంలో వినియోగించే రసాయనా ఎరువుల దిగుమతిపై నిషేధం గురించే. గతేడాది ఉన్నట్టుండి ఓ నిర్ణయం ప్రకటించారు అధ్యక్షుడు రాజపక్స. వందశాతం సేంద్రియసాగుతో ఆహారోత్పత్తులు తీసుకొస్తామని, రసాయనిక ఎరువుల దిగుమతిని పూర్తిగా నిషేధిస్తున్నామని ప్రకటించారు. ఏమీ ఆలోచించకుండా ఎడాపెడా ఆ ఫైల్‌పై సంతకం చేశారు. అదిగో అక్కడ మొదలైందీ పతనం. ఇంత సంచలన నిర్ణయం తీసుకునే ముందు ఓ సారైనా ఆలోచించాలి కదా. కనీసం నిపుణులు సలహాలైనా తీసుకోవాలి కదా. అదేమీ లేదు. రాత్రికి రాత్రే ప్రకటన చేస్తే, రైతులు ఏం చేస్తారు..? అప్పటికప్పుడు సేంద్రియ సాగుకి సిద్ధం కాలేక నీరుగారిపోయారు అన్నదాతలు. ఈ ఎఫెక్ట్ చాలా తొందరగానే కనిపించింది. 


అనాలోచిత నిర్ణయాలే ఇలా చేశాయి..


ఆహార ధాన్యాలతో పాటు టీ, మిరియాలు తదితర సాగుపై తీవ్ర ప్రభావం పడింది. దిగుబడి దారుణంగా పడిపోయింది. ప్రధాన ఆహారమైన అన్నమే లేకుండా పోతే, అక్కడి ప్రజలకు తిండి ఎక్కడ దొరుకుతుంది..? కొద్ది నెలల్లోనే అక్కడి ప్రజలు నాలుగు తిండి గింజల కోసం రోడ్లపైకి రావాల్సి వచ్చింది. ఆహారం సంగతి ఇలా ఉంటే..ఆర్థిక వ్యవస్థది మరో విషాద గాథ. 2109లో ఈస్టర్ దాడులు జరిగినప్పుడు మొదలయ్యాయి కష్టాలు. పర్యాటక రంగంలో అప్పటి వరకూ ఓ వెలుగు వెలిగిన శ్రీలంక, ఈ దాడుల తరవాత ఆ ఆదాయాన్ని భారీగా కోల్పోయింది. ఇది చాలదనుకుంటే...కొవిడ్ కూడా దాడి చేసింది. పర్యాటకులు రావటం మానేశారు. ఆ మేరకు ఖజానాలో కోత పడింది. క్రమంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతూ వచ్చాయి. ఈ పరిస్థితులు గమనించాక అయినా, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి కదా..? అదీ లేదు. పైగా అనాలోచిత నిర్ణయాలు తీసుకునే సంప్రదాయాన్ని అలాగే కొనసాగించింది. అమలు చేయటానికి సాధ్యం అవుతాయా లేదా అని కూడా ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పన్ను రేట్లు భారీగా తగ్గించేసింది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ మినహాయింపు పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. ఆర్థిక సేవల పన్నుతో పాటు నేషన్ బల్డింగ్ ట్యాక్స్‌ లాంటి ఆదాయం తెచ్చి పెట్టే పన్నులనూ రద్దుచేసింది. వ్యాట్‌నూ 15% నుంచి 8%కి కుదించింది. ఇన్ని చేసి, ఆదాయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది..?  


విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకుని...


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే...2019 నుంచి విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతూ వచ్చాయి. గొటబయ రాజపక్స అధికారంలోకి వచ్చే నాటికి ఆ దేశంలో 7.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. అవి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 2.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇక విదేశాలకు చెల్లించాల్సిన అప్పులు 4 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ అప్పులు చెల్లించటం సాధ్యపడలేదు. ఈ లోగా ద్రవ్యోల్బణమూ అదుపు తప్పింది. పెట్రోల్, పాలు, టీ పొడి, ఆహార పదార్థాలు...ఇలా అన్ని ధరలూ మూడింతలైపోయాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ప్రజలకు ఓ పూట తిండి దొరకటమూ గగనమైంది. ఆ ఆకలి మంటలే ఇప్పుడు ప్రధాని ఇంటిని తగలబెట్టాయని ప్రత్యేకంగా చెప్పాలా..?