దేశంలోనే 100 శాతం తొలి ప్రభుత్వ గ్రీన్ బిల్డింగ్ త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్ లో ఈ 100 పర్సెంట్ గ్రీన్ బిల్డింగ్ కొలువుదీరనుంది. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ (State Renewable Energy Development Corporation Limited - TSREDCO) కార్యాలయం కోసం ప్రభుత్వమే ఈ గ్రీన్ బిల్డింగ్‌ను నిర్మిస్తోంది. ఆ విభాగం కార్యకలాపాలకు తగ్గట్లుగానే ఆ కార్యాలయం కూడా ఉండడం విశేషం. 


ఈ భవనం సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC), గ్రిడ్ - ఇంటరాక్టివ్ నెట్ జీరో ఎనర్జీగా ఉండనుంది. మొత్తం 2,591 స్క్వేర్ మీటర్స్‌‌లో బేస్‌మెంట్ తో కలిపి 5 అంతస్తుల్లో ఈ గ్రీన్ బిల్డింగ్ ని కడుతున్నారు. పైన రూఫ్ గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు.  


అసలు గ్రీన్ బిల్డింగ్ ప్రత్యేకత ఏంటంటే.. 
ఈ బిల్డింగ్ కి ఒక భారీ విండ్ టవర్ ప్రత్యేకంగా అమర్చి ఉంటుంది. దీనిద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. రియల్ టైమ్ LED డిస్‌ప్లే, ప్రాంగణంలో బిల్డింగ్ ఇంటిగ్రేటెడ్ ఫోటోవోల్టాయిక్స్ (BVIP), రీసైకిల్ చేసిన టింబర్ స్లాబ్స్, మూవబుల్ షేడింగ్ స్క్రీన్స్ ఉంటాయి. శనివారం (జూలై 9) టీఎస్‌ఆర్‌ఈడీసీఓ చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డి గ్రీన్‌ బిల్డింగ్‌ నిర్మాణాన్ని పరిశీలించి, 2023 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు.


‘‘TSREDCO చేపడుతున్న దేశంలోనే తొలి 100 పర్సెంట్ గవర్నమెంట్ గ్రీన్ బిల్డింగ్ ఇది. ఒక్కసారి ఇది అందుబాటులోకి వస్తే ఇలాంటి భవనాలు దేశంలో అనేక చోట్ల నిర్మాణం అయ్యే అవకాశం ఉంటుంది.’’ అని వై.సతీష్ రెడ్డి తెలిపారు.


ఈ భవనంలో ఫైర్ డిటెక్షన్ వ్యవస్థ, ఎయిర్ కండీషనింగ్, వెంటిలేషన్, ఎలక్ట్రిక్ లైటింగ్, మొత్తం భవనంలో విద్యుత్ వాడకాన్ని రియల్ టైమ్‌లో చూపించే డేటా, ఇన్ఫర్మేషన్ డ్యాష్ బోర్డ్స్, ఎక్స్‌టెర్నల్ ఎల్ఈడీ డిస్ ప్లే సహా ఎన్నో వసతులను కల్పించనున్నారు. వర్షపు నీరు నిల్వ చేసే ట్యాంకులు, ఒకవేళ వరదలు (అర్బన్ ఫ్లడింగ్) వస్తే భవనం ప్రాంతంలో ఆ ఇబ్బందులు ఏర్పడకుండా చేసే వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. 


ఆటోక్లేవ్డ్ ఎరేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్, ఫ్లాట్ స్లాబ్ నిర్మాణంతో స్ట్రక్చరల్ ఎఫిషియెన్సీ సిస్టమ్ ఉంది. ఆఫీసు బిల్డింగ్‌ల భవనాల కోసం సాధారణంగా వాడే నిర్మాణ వ్యవస్థలతో పోలిస్తే ఈ వ్యవస్థ ద్వారా 10 శాతం తక్కువ స్టీల్ వినియోగం అవుతుంది.


ప్రాంగణం పశ్చిమ భాగంలో ఒక పార్కుతో పాటు, అటు వైపు నుంచి వచ్చే గాలులు లోనికి వీచేలా ఏర్పాటు ఉంటుంది. ఈ నిర్మాణం నేచురల్ వెంటిలేషన్ పొటెన్షియల్ బిల్డింగ్ గా ఉంటుంది. దీనితో పాటు, సోలార్ పలకలు, బిల్డింగ్ ప్రాంగణం, రూఫ్ కు నీడనిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది రేడియేషన్‌ను దాదాపు 60 శాతం తగ్గిస్తుందని అధికారులు చెప్పారు. భవనం పూర్తయిన తర్వాత, అందులోని కొన్ని ఫ్లోర్స్ ను తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉపయోగించుకుంటుందని అధికారులు తెలిపారు.