West Godavari News: 'పక్షికింత ధాన్యం.. పశువుకింత గ్రాసం.. సాటి మనిషికింత సాయం.. వీటికన్నా గొప్ప పూజలు ఏమైనా అన్నాయా ఈ లోకంలో' ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. మానవ సేవయే మాదవ సేవ అనే తత్వాన్ని బోధిస్తుంది ఈ డైలాగ్. ఆపదలో ఉన్నవారికి, కష్టం సమయంలో ఇబ్బంది పడుతున్నవారికి తోచినంత, చేతనైనంత సాయం చేయడం ఆ దేవుడికి సేవ చేయడం ఒకటే. రోడ్డుపై వెళ్తుండగా ఎవరికైనా దెబ్బ తగిలితే ఆపి ఆస్పత్రికి తీసుకెళ్తాం. కానీ అదే రోడ్డుపై ధాన్యం ఆరబెట్టుకున్న రైతు కళ్లల్లో కంటనీరు రాకుండా చేసిందో పెళ్లి బృందం. అలా పెళ్లి బృందం చూపిన మానవత్వం ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది. 


గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఆరుగాలం శ్రమించి, కష్ట నష్టాలకు ఓర్చి పండించిన పంట అకాల వర్షానికి, వరుణుడి ప్రతాపానికి గురయ్యి నష్టపోతుంటే చూసి తట్టుకోలేక గుండెలు పగిలేలా కన్నీరు పెడుతున్నారు. చేతికొచ్చిన ధాన్యం వాన నీటికి తడిసి మొలకలు వస్తుంటే ఆ రైతు పెట్టే శోకం రాతి గుండెలను కూడా ద్రవింపజేస్తోంది. కోతకు వచ్చిన పంట ఉద్ధృతంగా కొడుతున్న వానలకు ఒరిగిపోతుంటే ఆ రైతులు దిక్కుతోచక విలపించడం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. దుక్కి దున్నడం నుండి వరి ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోసేంత వరకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలో తెలిసిన ఆ రైతన్నకు, వరుణుడు తమపై కోపాన్ని ప్రదర్శిస్తుంటే ఏం చేయాలో తెలియక బిక్క మోహం వేస్తుండటం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది.


ఏడాదంతా పండించిన మామిడి పంట, అకాల వానలకు రాలి పోతుంటే అన్నదాతలు పడే ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది. అకాల వర్షం నుండి ధాన్యం కాపాడుకోవడానికి ఓ రైతుకు పెళ్లి బృందం సాయం చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటోంది. కష్టాల్లో ఉన్న రైతన్నకు వారికి చేతనైనంత సాయం చేయడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. అకాల వానలతో సతమతం అవుతున్న రైతన్నలు ఇలాగే సాయాన్ని కోరుకుంటున్నారని కొందరు అంటున్నారు.


అసలేం జరిగిందంటే.. 
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజవర్గం తేతలి గ్రామంలో ఓ పెళ్లి బృందం మేళతాళాలతో ఆలయాల్లో పానకాలు పోసుకోవడానికి వెళ్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి వర్షం వచ్చింది. పక్కనే ఓ రైతు తను ఆరబెట్టుకున్న ధాన్యాన్ని ఒబ్బిడి చేయడానికి కష్టపడుతున్నాడు. ఆ అన్నదాత పడుతున్న కష్టాన్ని చూసిన ఆ పెళ్లి బృందం సభ్యులు, బ్యాండ్ వాయించే వారు అంతా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆ రైతుకు సాయం చేశారు. ధాన్యాన్ని ఒబ్బిడి చేయడంలో ఆ అన్నదాతకు సహాయపడ్డారు. వీరంతా కలిసి ఆ రైతుకు సాయం చేయడాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా  అది కాస్త వైరల్ గా మారింది. 


అకాల వర్షాలతో రైతు పడుతున్న బాధను తట్టుకోలేక ఆ పెళ్లి బృందం మానవత్వంతో చేసిన సాయం అందరి మనసులను గెలుచుకుంటోంది. ఇలాంటి స్ఫూర్తి, తోటి వ్యక్తుల పట్ల దయ ప్రతి ఒక్కరికీ ఉండాలని అంటున్నారు. తోటి మనిషికి సాయం చేయాలన్న వారి ఆలోచన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొంటున్నారు.