Kanchanjunga Express Accident: బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 35 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఒడిశా బాలాసోర్ ప్రమాదం నాటి రోజుల్ని గుర్తు చేసింది ఈ యాక్సిడెంట్. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని వెనక నుంచి వచ్చి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఏడాది క్రితం జూన్ 2వ తేదీన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఇదే తరహా ప్రమాదం జరగడం అలజడి రేపుతోంది. ఈ ప్రమాదంలో లోకోపైలట్ కూడా మృతి చెందాడని తెలుస్తోంది. అయితే...ఈ ఘటనపై ABP News ప్రయాణికులతో మాట్లాడింది. ప్రమాద సమయంలో అసలేం జరిగిందని అడిగి తెలుసుకుంది. అప్పుడు ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాలేదని, నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని ప్రయాణికులు చెప్పారు. ఆ క్షణాలను తలుచుకుని వణికిపోతున్నారు.  Kanchanjunga Express అగర్తలా నుంచి కోల్‌కత్తాకి వెళ్తోంది. నిజ్బరి చత్తరహాట్‌ స్టేషన్ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8.45 నిముషాలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. గూడ్స్ ట్రైన్‌ వేగంగా వచ్చి ఎక్స్‌ప్రెస్‌ని ఢీకొట్టింది. ఈ ధాటికి రెండు బోగీలు అమాంతం గాల్లోకి 20 అడుగుల ఎత్తులోకి ఎగిరి కింద పడిపోయాయి. మరో కోచ్ గూడ్స్‌పైకి ఎక్కింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయట పడ్డ ప్రయాణికులు ఆ సమయంలో ఏం జరిగిందో వివరించారు. ఉన్నట్టుండి పెద్ద శబ్దాలు వినిపించాయని, ఒక్కసారిగా కుదిపేసినట్టు అయిందని చెప్పారు. 






"ఒక్కసారిగా మాకు పెద్ద శబ్దం వినిపించింది. ఉలిక్కిపడ్డాం. లోపల ఉన్న వాళ్లంతో గట్టిగా కేకలు పెట్టారు. చాలా సేపటి వరకూ ఎలాంటి సాయం అందలేదు. రైల్వే అధికారులు కానీ అగ్నిమాపక సిబ్బంది కానీ రాలేదు. ఎమర్జెన్సీ సర్వీస్‌ కూడా అందుబాటులో లేదు. కాస్త ముందే అప్రమత్తమై ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదు"


- బాధితుడు


మరో బాధితుడు కూడా స్పందించాడు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయని ప్రశ్నించాడు. ప్రమాదం జరిగినప్పుడు అంతా చీకటి అయిపోయిందని, ఎవరికీ అర్థం కాక అయోమయంలో పడిపోయామని వివరించాడు. వెంటనే రైల్‌లో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పాడు. 


"ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయనేది అంతుపట్టకుండా ఉంది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. అంత మంది ప్రాణాలకు రక్షణే లేదా..? ఒక్కసారిగా కుదిపేసినట్టు అయింది. గట్టిగా కేకలు పెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే అంతా చీకటి అయిపోయింది. ఎలాగోలా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాం"


- బాధితుడు 


Also Read: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణమిదే, అధికారులు ఏం చెబుతున్నారంటే?